Homeజిల్లాలుఅనంతపురంఅనావృష్టితో అల్లాడుతున్న రైతాంగం.. తక్షణమే కరువు మండలంగా ప్రకటించాలి: డి. చిన్నప్ప యాదవ్

అనావృష్టితో అల్లాడుతున్న రైతాంగం.. తక్షణమే కరువు మండలంగా ప్రకటించాలి: డి. చిన్నప్ప యాదవ్

- Advertisement -

విశాలాంధ్ర- నార్పల:- మండల పరిధిలో నెలకొన్న తీవ్ర అనావృష్టి, వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నార్పల మండలాన్ని తక్షణమే కరువు మండలంగా ప్రకటించి రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు, చేతివృత్తిదారులను ఆదుకునేందుకు ప్రత్యేక కరువు సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మండల సమితి ఆధ్వర్యంలో శుక్రవారం నార్పల పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులు కి వినతిపత్రం సమర్పించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు డి. చిన్నప్ప యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్‌లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. సాధారణ వర్షపాతంతో పోలిస్తే భారీ లోటు నమోదవడంతో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. వర్షాలు సకాలంలో కురవకపోవడంతో రైతులు పంటలు సాగు చేయలేకపోయారని, ఇప్పటికే సాగు చేసిన పంటలు కూడా ఎండుముఖం పట్టాయని ఆవేదన వ్యక్తం చేశారు. కంది, టమోటా, పత్తి, వేరుశనగతో పాటు ఇతర పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, రైతాంగానికి భారీ ఆర్థిక నష్టం వాటిల్లిందన్నారు.
వర్షాభావం కారణంగా వ్యవసాయ కార్మికులకు ఉపాధి లేకుండా పోయిందని, చేతివృత్తిదారుల జీవనోపాధి దెబ్బతిందని, గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. పశువులకు మేత, తాగునీరు లేక రైతులు తమ పశువులను అమ్ముకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇంతటి దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నప్పటికీ ప్రభుత్వం కరువు మండలాల ప్రకటనలో జాప్యం చేయడం బాధాకరమని విమర్శించారు.
మండలంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను సమగ్రంగా అంచనా వేసి తక్షణమే కరువు మండలంగా ప్రకటించాలని, రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, పంటల బీమా పరిహారం, రుణమాఫీ, కౌలు రైతులకు గుర్తింపు, ఉపాధి హామీ పనుల విస్తరణ, పశువులకు ఉచిత మేత, తాగునీటి సౌకర్యం, కరువు పింఛన్ తదితర సహాయక చర్యలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ వినతిపత్రాన్ని జిల్లా కలెక్టర్‌కు పంపించాలని పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులు కోరారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ నార్పల మండల కార్యదర్శి గంగాధర్, రైతు సంఘం మండల కార్యదర్శి లలితమ్మ, సీపీఐ మండల సహాయ కార్యదర్శి చాఫల రామాంజి, రైతులు భయన్న, వెంకటరాముడు, సంజీవరాయుడు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు