ఏపీ వృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షులు సి లింగమయ్య
విశాలాంధ్ర -అనంతపురం : మహాత్మా జ్యోతి బాపూలే కుల వివక్షత పై పోరాడిన సంఘసంస్కర్త అని ఏపీ వృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షులు సి లింగమయ్య కొనియాడారు. శుక్రవారం స్థానిక జిల్లా పరిషత్ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అసామాన్యుడిగా జన్మించినా సామాజిక విప్లవానికి నాంది పలికినటువంటి వ్యక్తి అన్నారు. ఆనాటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని ప్రభావితం చేసినటువంటి వ్యక్తి జ్యోతిబా పూలే అని, తన రచనలలో పూలేని అభినందించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయన్నారు. ఆనాటి పరిస్థితుల్లో వర్ణ వివక్ష, కుల వివక్ష ఉన్నటువంటి రోజుల్లో వాటికి వ్యతిరేకంగా నిలిచి, బాల్య వివాహాలను, వితంతు వివాహాల వంటి సామాజిక రుగ్మతల పట్ల చైతన్యం చేసినటువంటి వ్యక్తిగా నిలిచారన్నారు. వెనుకబడిన కులాలను ముందుకు తీసుకొచ్చే విధంగా ఒక ఉద్యమానికి శ్రీకారం చుట్టారన్నారు. ఈ కార్యక్రమంలో చేతివృత్తిదారుల సమాఖ్య జిల్లా కార్యదర్శి సి.వి. హరికృష్ణ, రజక వృత్తిదారుల సమాఖ్య జిల్లా అధ్యక్షులు సి. నాగప్ప, జిల్లా నాయకులు సి. రాజు, గొర్ల మేకల పెంపకం దారుల సంఘం నాయకులు సి. రాము తదితరులు పాల్గొన్నారు.