Homeజాతీయంఏఐతో పెను ప్రమాదం.. గూగుల్, మెటాపై కోర్టులో వ్యాజ్యం

ఏఐతో పెను ప్రమాదం.. గూగుల్, మెటాపై కోర్టులో వ్యాజ్యం

- Advertisement -

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో సరికొత్త ఆవిష్కరణలతో దూసుకెళుతున్న గూగుల్, మెటా, ఓపెన్ఏఐ, ఆంత్రోపిక్ వంటి టెక్ దిగ్గజాలకు న్యాయపరంగా పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఈ టెక్నాలజీ మానవాళి మనుగడకే పెను ముప్పుగా మారే ప్రమాదం ఉందని.. కాబట్టి అత్యంత శక్తిమంతమైన ఏఐ మోడళ్ల అభివృద్ధిని తక్షణమే నిలిపివేయాలని కోరుతూ పలు లాభాపేక్షలేని సంస్థలు (నాన్‌ప్రాఫిట్స్) కోర్టును ఆశ్రయించాయి. చాట్‌జీపీటీ, జెమినీ, క్లాడ్ వంటి ఏఐ ఉత్పత్తుల తదుపరి అభివృద్ధిని నిరోధించాలని డిమాండ్ చేస్తూ శాన్‌ఫ్రాన్సిస్కో కోర్టులో ఈ వ్యాజ్యం దాఖలు చేశాయి. ఇర్రిప్లేసబుల్ ఎడ్యుకేషన్ ఫండ్, పబ్లిక్ సిటిజన్, హీట్ ఇనిషియేటివ్ వంటి సంస్థలు కలిసి ఈ పిటిషన్ వేశాయి. కాలిఫోర్నియాలోని ఃఅన్యాయమైన వ్యాపార పద్ధతులః చట్టాలను ఆధారంగా చేసుకుని ఈ దావా వేశారు. ఆసక్తికరంగా ఈ వ్యాజ్యంలో ఏఐ కంపెనీల అధినేతల వ్యాఖ్యలనే సాక్ష్యాలుగా పొందుపరిచారు. ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోదీ, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ వంటి వారు గతంలో ఏఐ వల్ల నాగరికత నాశనమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించిన విషయాన్ని పిటిషనర్లు గుర్తుచేశారు. కొన్ని ఏఐ మోడళ్లు ఇప్పటికే పరీక్షల దశ నుంచి తప్పించుకుని ప్రభుత్వ వెబ్‌సైట్లపై స్వయంగా దాడులు చేసిన ఘటనలను కూడా ప్రస్తావించారు. ఇప్పటికే ఏఐ భద్రతపై పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా న్యాయపోరాటం చేస్తున్నాయి. గత జూన్‌లో ఫ్లోరిడా అటార్నీ జనరల్ జేమ్స్ ఉత్మీయర్ ఓపెన్ఏఐపై దావా వేశారు. చాట్‌జీపీటీ ప్లాట్‌ఫామ్ పిల్లలకు హానికరమైన సమాచారాన్ని అందిస్తోందని, స్కూల్ షూటర్లకు సమాచారం ఇవ్వడం, ఆత్మహత్యలకు పురిగొల్పే సూచనలు చేయడం వంటి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై స్పందించిన ఓపెన్ఏఐ, తమ శక్తిమంతమైన మోడళ్ల శిక్షణను తాత్కాలికంగా నిలిపివేశామని, మరిన్ని భద్రతా ప్రమాణాలు ఏర్పాటు చేశాకే ముందుకు వెళ్తామని తెలిపింది.ఇదిలా ఉండగా.. గత నెలలో మరో 8 రాష్ట్రాలు కలిసి ఓపెన్ఏఐపై దేశవ్యాప్తంగా వేర్వేరు కోర్టుల్లో కేసులు పెట్టాయి. మానవ విలువలకు కట్టుబడి ఉండేలా హామీ ఇవ్వకుండా, స్వీయ-అభివృద్ధి చేసుకునే ఏఐ మోడళ్లను తయారు చేయకూడదని వారు డిమాండ్ చేస్తున్నారు. ఒకవైపు చైనాతో పోటీని దృష్టిలో ఉంచుకుని ట్రంప్ ప్రభుత్వం ఏఐపై కఠిన నిబంధనలు విధించడానికి విముఖత చూపుతుండగా, మరోవైపు ఈ న్యాయపోరాటాలు టెక్ పరిశ్రమలో తీవ్ర చర్చకు దారితీశాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు