రాధ తల్లిదండ్రులతో మండల విద్యాధికారి రామ్మూర్తి
విశాలాంధ్ర – పెద్దకడబూరు : మండల పరిధిలోని గవిగట్టు గ్రామంలో ఆర్థిక పరిస్థితుల వల్ల బడి మానివేసిన రాధను మండల విద్యాధికారి రామ్మూర్తి 2 మళ్లీ బడిబాట పట్టించారు. మంగళవారం గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి పదోతరగతి విద్యార్థుల హాజరును పరిశీలించారు. కొంత మంది విద్యార్థులు వలసలు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా పాఠశాలకు రావడం లేదని గుర్తించారు. ఇందులో భాగంగా తరగతిలో తెలివైన విద్యార్థిని రాధ ఆర్థిక ఇబ్బందుల కారణంగా బడికి రాకుండా కూలీ పనులకు వెళ్తుందని దృష్టికి వచ్చింది. వెంటనే ఆమె ఇంటికి వెళ్లి తల్లిదండ్రులు నరసయ్య, తల్లి సావిత్రమ్మను కలిశారు . ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగా లేనందున రాధను కూలీ పనికి పంపుతున్నామని తెలిపారు. విద్య యొక్క ప్రాముఖ్యత గురించి వివరించారు. రాధను తిరిగి బడికి పంపించాలని సుమారు రెండు గంటల పాటు మాట్లాడారు. రాధను కూడా కలవగా సార్ నాకూ చదువుకోవాలని చాలా కోరికగా ఉందన్నారు. రాధ గత సంవత్సరంలో జిల్లా స్థాయి డిస్కస్ త్రోలో గోల్డ్ మెడల్ సాధించారు. అదే సంవత్సరంలో ఏలూరులో రాష్ట్ర స్థాయి పోటీల్లో కూడా పాల్గొంది. దీంతో మరోసారి మండల విద్యాశాఖ అధికారి తల్లిదండ్రులను ఒప్పించారు. ఇకపై తమ కూతురిని క్రమం తప్పకుండా పాఠశాలకు పంపిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజాబ్ సాబ్, విద్యాకమిటీ చైర్మన్ దాసప్ప తదితరులు పాల్గొన్నారు.


