Homeజాతీయంఎన్‌పీఎస్‌లో భారీ మార్పులు.. 5 కొత్త కేటగిరీలు.. అక్టోబర్‌ 1 నుంచి రూ.200 ఛార్జీ!

ఎన్‌పీఎస్‌లో భారీ మార్పులు.. 5 కొత్త కేటగిరీలు.. అక్టోబర్‌ 1 నుంచి రూ.200 ఛార్జీ!

- Advertisement -

నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌ (ఎన్‌పీఎస్‌)లో కీలక మార్పులు రానున్నాయి. పథకాలను ఎలా వర్గీకరించాలి? వాటి వివరాలను ఎలా చూపించాలి? అన్నదానిపై పెన్షన్‌ నియంత్రణ సంస్థ పీఎఫ్‌ఆర్‌డీఏ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఆగస్టు 28న జారీ చేసిన సర్క్యులర్‌లో ఈ మార్పులను ప్రకటించింది. 2026 అక్టోబర్‌ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.

ఇకపై ఎన్‌పీఎస్‌ పథకాలను ఈక్విటీ పెట్టుబడి ఆధారంగా ఐదు కేటగిరీలుగా విభజిస్తారు. 80-100 శాతం ఈక్విటీ ఉన్న పథకాలు ‘కేటగిరీ-ఏ’లో ఉంటాయి. వీటిని అత్యంత అధిక రిస్క్‌ ఉన్న ‘అగ్రెసివ్‌ గ్రోత్‌’ పథకాలుగా చూపిస్తారు. 60-80 శాతం ఈక్విటీ ఉన్నవి ‘కేటగిరీ-బి’లో ఉంటాయి. వీటిని అధిక రిస్క్‌ ఉన్న ‘హై గ్రోత్‌’ పథకాలుగా పేర్కొంటారు.

35-60 శాతం ఈక్విటీ ఉన్నవి ‘కేటగిరీ-సి’లో ఉంటాయి. ఇవి మధ్యస్థ రిస్క్‌ ఉన్న ‘బ్యాలెన్స్‌డ్‌ గ్రోత్‌’ పథకాలు. 10-35 శాతం ఈక్విటీ ఉన్నవి ‘కేటగిరీ-డి’లో ఉంటాయి. వీటిని ‘కన్జర్వేటివ్‌’గా పరిగణిస్తారు. 0-10 శాతం ఈక్విటీ ఉన్నవి ‘కేటగిరీ-ఈ’లో ఉంటాయి. ఇవి రుణ ఆధారిత పథకాలుగా ఉంటాయి.

ఒక పథకం ఈక్విటీ పరిమితి రెండు కేటగిరీల్లోకి వచ్చేలా ఉండకూడదు. దీంతో పెట్టుబడిదారులు తమ రిస్క్‌ స్థాయికి తగ్గ పథకాన్ని సులభంగా ఎంచుకోవచ్చు.

ఎన్‌పీఎస్‌లో చేరే వారికి మరో మార్పు కూడా ఉంది. అక్టోబర్‌ 1 నుంచి ‘పాయింట్‌ ఆఫ్‌ ప్రజెన్స్‌’ (పీఓపీ) ద్వారా కొత్తగా ఎన్‌పీఎస్‌ ఖాతా తెరిచే వారికి ఒక్కో పీఆర్‌ఏఎన్‌పై రూ.200 వన్‌టైమ్‌ ఛార్జీ వసూలు చేస్తారు. ఈ మొత్తాన్ని ఒకేసారి కాకుండా ప్రతి త్రైమాసికానికి రూ.50 చొప్పున యూనిట్లను రద్దు చేసి వసూలు చేస్తారు.

పథకాలను ఎంచుకునే ముందు పెట్టుబడిదారులకు మరింత సమాచారం అందేలా పీఎఫ్‌ఆర్‌డీఏ చర్యలు తీసుకుంది. పథకం పేరు, పెన్షన్‌ ఫండ్‌, ప్రారంభ తేదీ, రాబడులు, బెంచ్‌మార్క్‌, ఛార్జీలు, రిస్క్‌మీటర్‌, నిర్వహణలో ఉన్న ఆస్తుల వివరాలు ఒకే విధానంలో కనిపించనున్నాయి. అయితే ప్రభుత్వ రంగ ఎన్‌పీఎస్‌ ఖాతాలకు కొత్త వర్గీకరణ వర్తించదు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు