Tuesday, May 6, 2025
Homeఅంతర్జాతీయంపాకిస్థాన్ కు నీటి కటకట..ఖరీఫ్ సీజన్‌పై ప్రభావం

పాకిస్థాన్ కు నీటి కటకట..ఖరీఫ్ సీజన్‌పై ప్రభావం

చీనాబ్ నదిపై సలాల్, బగ్లిహార్ డ్యామ్‌ల గేట్లు మూసివేత
ఖరీఫ్ సీజన్‌లో పాక్‌లో 21% నీటి కొరత ఏర్పడవచ్చని ఐఆర్ఎస్ఏ అంచనా

పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం సింధూ నదీ జలాల ఒప్పందాన్ని భారత్ పాక్షికంగా నిలిపివేయడంతో పాకిస్థాన్‌లో నీటి కొరత ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రానున్న ఖరీఫ్ సీజన్‌పై ఈ ప్రభావం తీవ్రంగా ఉండవచ్చని ఇండస్ రివర్ సిస్టమ్ అథారిటీ (ఐఆర్ఎస్ఏ) అంచనా వేసింది. పాక్‌కు వెళ్లే నీటిలో సుమారు 21 శాతం వరకు కోత పడే అవకాశం ఉందని అభిప్రాయపడింది.

చీనాబ్ నదిపై ఉన్న సలాల్, బగ్లిహార్ డ్యామ్‌ల గేట్లను భారత్ మూసివేయడమే ప్రస్తుత పరిస్థితికి ప్రధాన కారణం. దీనివల్ల పాకిస్థాన్‌లోని మరాల వద్ద చీనాబ్ నదిలో నీటి లభ్యత గణనీయంగా పడిపోయింది. అక్నూర్ వద్ద కూడా చీనాబ్ ప్రవాహం బాగా తగ్గిందని సమాచారం. ఖరీఫ్ సీజన్ ప్రారంభమయ్యే ఈ నెల నుంచి నీటి కొరత మరింత తీవ్రతరం కావచ్చని ఐఆర్ఎస్ఏ తెలిపింది. మే-జూన్ మధ్య నీటి లభ్యతపై సమీక్ష నిర్వహించిన ఐఆర్ఎస్ఏ, చీనాబ్ నదిలో ప్రస్తుత నీటి ప్రవాహ స్థాయులు కొనసాగితే పాకిస్థాన్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందని పేర్కొంది.

ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలోనే భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. సింధూ జలాలను నిలిపివేయడంతో పాటు, పాకిస్థాన్‌తో వాణిజ్యం, రాకపోకలను కూడా భారత్ నిషేధించిన విషయం తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, నీటి లభ్యతను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తమ అంచనాలను సవరిస్తామని ఐఆర్ఎస్ఏ తెలిపింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు