తమిళనాడు రాజకీయాల్లో మారుతున్న పరిణామాలు
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో సమీకరణాలు మారుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అన్నాడీఎంకే బహిష్కృత నేత, మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం డీఎంకే పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి స్టాలిన్ సమక్షంలో శుక్రవారం ఉదయం ఆయన పార్టీలో చేరారు. డీఎంకే పార్టీ పన్నీరు సెల్వంకు ఎమ్మెల్యే టికెట్ ఖాయం చేసినట్లు తెలుస్తోంది. తేని జిల్లాలోని బోడినాయకనూర్ నియోజకవర్గం నుంచి పన్నీరు సెల్వం పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఇక్కడినుంచే పోటీ చేసి గెలిచారు. ఈ ఎన్నికల్లో కూడా అదే నియోజకవర్గం నుంచి పోటీలో నిలిచే అవకాశం ఉంది. కాగా, వారం రోజుల క్రితం పన్నీరు సెల్వం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌తో భేటీ అయ్యారు. అనంతరం పన్నీరు సెల్వం మీడియాతో మాట్లాడుతూ.. డీఎంకే ఐదేళ్ల పాలనపై ప్రశంసల జల్లులు కురిపించారు. డీఎంకే ప్రభుత్వం మళ్లీ ఏర్పడుతుందని, గత ఐదేళ్లుగా సీఎం స్టాలిన్ విజయవంతమైన, సుపరిపాలన అందించారని అన్నారు. అందుకే తాను సీఎం స్టాలిన్‌ను కలిసి.. అభినందనలు తెలిపానని చెప్పారు. డీఎంకే పాలనపై ప్రజల్లో నమ్మకం ఉందని, త్వరలో జరగనున్న ఎన్నికల్లో మళ్లీ డీఎంకేనే గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


