Homeజిల్లాలుఅనంతపురంతుంగభద్ర వరద నీటి వినియోగానికి సమాంతర కాలువ నిర్మించాలి: సిపిఐ డిమాండ్

తుంగభద్ర వరద నీటి వినియోగానికి సమాంతర కాలువ నిర్మించాలి: సిపిఐ డిమాండ్

- Advertisement -

విశాలాంధ్ర, అనంతపురం రూరల్: తుంగభద్ర జలాశయం నుంచి ప్రతి ఏటా సముద్రంలోకి వృథాగా వెళ్తున్న వరద నీటిని సద్వినియోగం చేసుకునేందుకు సమాంతర వరద కాలువను వెంటనే నిర్మించాలని సీపీఐ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల పరస్పర ప్రయోజనాల కోసం ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అంశంపై తక్షణమే చర్చలు జరిపి చర్యలు చేపట్టాలని కోరారు. గురువారం బళ్లారిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జగదీష్, బళ్లారి జిల్లా సీపీఐ కార్యదర్శి ఆదిమూర్తి, జిల్లా సహాయ కార్యదర్శి కట్టేబసప్ప మాట్లాడారు. 2019 నుంచి వరుసగా తుంగభద్ర డ్యామ్‌ నిండిన సందర్భాల్లో లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి, శ్రీశైలం ప్రాజెక్టు మీదుగా కృష్ణా నదిలోకి వృథాగా వెళ్తోందని వారు తెలిపారు. ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొని తాగునీరు, సాగునీటికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వరద కాలువ నిర్మించి తుంగభద్ర నుంచి అదనపు నీటిని నిల్వ చేసుకుంటే భవిష్యత్తులో కరువు పరిస్థితుల్లో వినియోగించుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.గతంలో తెలుగుదేశం ప్రభుత్వం కర్ణాటక ముఖ్యమంత్రితో సమాంతర వరద కాలువ అంశంపై చర్చలు జరిపిందని, అయితే అప్పటి కర్ణాటక ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో ప్రతిపాదన ముందుకు సాగలేదని నాయకులు తెలిపారు. ప్రస్తుతం కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ఉన్నందున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ అంశంపై చర్చలు జరిపి పరిష్కారానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు. తుంగభద్ర డ్యామ్‌లో పూడిక తొలగింపు సాధ్యం కాదని నిపుణులు తేల్చిచెప్పిన నేపథ్యంలో సమాంతర కాలువ నిర్మాణమే ప్రత్యామ్నాయ మార్గమని వారు పేర్కొన్నారు. ఈ కాలువ నిర్మాణంతో అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు జిల్లాలతో పాటు కర్ణాటకలోని పలు ప్రాంతాలకు తాగు, సాగునీటి ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.

బళ్లారి సమీపంలోని చాగనూరు, సిరివరం గ్రామాల్లో గతంలో సేకరించిన సుమారు 900 ఎకరాల భూమిలో అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. విమానాశ్రయం అందుబాటులోకి వస్తే వ్యాపారవేత్తలు, విదేశాల్లో పనిచేస్తున్న ఐటీ ఉద్యోగులు, ప్రాంతీయ ప్రజల రవాణాకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని అన్నారు.

అనంతపురం జిల్లా కూడేరు మండలంలో పండించే వివిధ రకాల పండ్ల ఉత్పత్తులను ఇతర రాష్ట్రాలు, విదేశాలకు ఎగుమతి చేసేందుకు అనువుగా కూడేరు ప్రాంతంలో కార్గో విమానాశ్రయాన్ని త్వరితగతిన ఏర్పాటు చేయాలని వారు కోరారు.ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, హిందూపురం పార్లమెంట్ సభ్యుడు బీకే పార్థసారథి, అనంతపురం పార్లమెంట్ సభ్యురాలు అంబికా లక్ష్మీనారాయణ విమానయాన శాఖ మంత్రితో చర్చలు జరిపిన విషయాన్ని వారు ప్రస్తావించారు. కార్గో విమానాశ్రయం ఏర్పాటైతే రాయలసీమలో పండించే పండ్లు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను దేశ, విదేశీ మార్కెట్లకు వేగంగా తరలించేందుకు రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు.ఇప్పటివరకు పనులు ప్రారంభం కాలేదని, కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని కూడేరు వద్ద కార్గో విమానాశ్రయం ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

ఈ సమస్యలపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి వినతిపత్రాలు సమర్పిస్తామని, కర్ణాటక–ఆంధ్రప్రదేశ్ సీపీఐ శాఖలు ఐక్యంగా పోరాడి ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తాయని నాయకులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు