విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : విద్యుత్ శాఖ ఏఈ వల్లే మండలంలో విద్యుత్ కోతలు విధిస్తున్నారని సిపిఐ మండల కార్యదర్శి వీరేష్ ఆరోపించారు. శుక్రవారం పెద్దకడబూరులోని స్థానిక సిపిఐ కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో విచ్చలవిడిగా విద్యుత్ కోతలు విధిస్తున్నారని దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. రోజుకు దాదాపు మూడు గంటలు పాటు విద్యుత్ కోతల ఉండటంతో రాత్రి వేళల్లో ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారన్నారు. విద్యుత్ ఏఈ ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో తెలియడం లేదన్నారు. మండలంలో విద్యుత్ సమస్య ఇంత ఉన్నా సమస్య తీర్చడంలో ఏఈ నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మండలంలో విద్యుత్ కోతలు ఆపాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున సబ్ స్టేషన్ ఎదుట ధర్నా కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు.


