కాలిఫోర్నియాలోని శాన్ డియాగోలో గురువారం అర్ధరాత్రి దుర్ఘటన
అమెరికాలో గురువారం అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. దక్షిణ కాలిఫోర్నియాలోని శాన్ డియాగోలో ఓ చిన్న విమానం అదుపుతప్పి జనావాసాలపై పడింది. దీంతో మంటలు ఎగిసిపడి 15 ఇళ్లు, పదుల సంఖ్యలో కార్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని స్థానిక అధికారులు వెల్లడించారు. నగర శివార్లలోని స్కల్పిన్ స్ట్రీట్, శాంటో రోడ్ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. వెంటనే స్పందించిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని, ప్రజలెవరూ అటువైపు రాకుండా హెచ్చరికలు జారీ చేశారు.
ప్రమాదానికి గురైన విమానం సెస్నా రకానికి చెందినదిగా గుర్తించారు. ఈ ప్రమాదంలో పైలట్ సహా ఇద్దరు మరణించారని, జనావాసాలపై విమానం కూలినందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. విమాన శకలాలు చెల్లాచెదురుగా పడిపోయాయని శాన్ డియాగో అగ్నిమాపక శాఖ సహాయ ప్రధాన అధికారి ఏబీసీ న్యూస్‌కు తెలిపారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు.