జిల్లాలో 45 రోజుల్లోపు కేటాయించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి
విశాలాంధ్ర – అనంతపురం : జిల్లాలో పీఎం సూర్య ఘర్ అమలును వేగవంతం చేయాలని, రోజువారిగా పురోగతి సాధించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి ఆదేశించారు. బుధవారం అనంతపురం నగరంలోని ఏపీఎస్పీడీసీఎల్ కార్యాలయంలో ఉన్న సమావేశ మందిరంలో పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం, పీఎం కుసుమ్, తదితర అంశాలపై ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ, ఈఈలు, డిఈలు, ఏఈలతో అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణతో కలిసి జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలో పీఎం సూర్య ఘర్ పథకం కింద 46,782 దరఖాస్తులు రావడం జరగగా, అందులో 2,752 దరఖాస్తులు వెండర్స్ ను ఎంపిక చేసుకోగా, 54 దరఖాస్తుల పరిశీలన పెండింగ్ ఉందని, 308 మందికి సబ్సిడీ జమ కావడం జరిగిందన్నారు. పీఎం సూర్య ఘర్ పథకం కింద జిల్లాలో కేటాయించిన లక్ష్యాన్ని 45 రోజుల్లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందులో నిదానంగా పనిచేయడానికి వీలులేదని, కేటాయించిన లక్ష్యానికి అనుగుణంగా వేగంగా పథకం అమలు చేపట్టాలన్నారు. వెండర్స్ వారిగా రిపోర్ట్ అందించాలని, వెండర్స్ అందరూ వారికి కేటాయించిన లక్ష్యాన్ని తప్పనిసరిగా పూర్తి చేయాలన్నారు. ఈ పథకం అమలులో ప్రతిరోజు పురోగతి రావాలని, రోజువారిగా సమీక్ష నిర్వహించాలని ఆదేశించారు. ప్రతిరోజు ఒక ఏఈ ఒక దరఖాస్తును పూర్తి చేయాలని, మంజూరైన ప్రాజెక్టులు గ్రౌండ్ కావాలని, ఇళ్లపై సోలార్ ప్యానల్స్ బిగించడం చేయాలన్నారు. సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటుకు అవసరమైన పరికరాలను వెండర్స్ సిద్ధంగా పెట్టుకోవాలన్నారు. ప్రతి దరఖాస్తు ఏ స్థాయిలో ఉందో ఆన్లైన్ పోర్టల్ లో కనిపించేలా చూడాలన్నారు. పెండింగ్ దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయించాలన్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు లక్ష్యం చేరుకునే విధంగా పనిచేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పీఎం సూర్య ఘర్ పథకం అమలులో జిల్లాని భారతదేశంలోనే ప్రథమ స్థానంలో నిలిపేలా అధికారులు పనిచేయాలన్నారు. ఈ పథకం అమలుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ఎస్సీ, ఎస్టీ దరఖాస్తులను ముందుగా పూర్తి చేయాలన్నారు. ఎన్డీఏ కూటమి ప్రజా ప్రతినిధులతో కలిసి అధికారులు ఈ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వ పథకాలపై అధికారులకు కూడా పూర్తి అవగాహన ఉండాలన్నారు. ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేసి కేటాయించిన లక్ష్యాన్ని చేరుకునేందుకు కృషి చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ శేషాద్రి శేఖర్, ఎల్డిఎం నర్సింగరావు, ఈఈలు జెవి.రమేష్, రాజశేఖర్, డిఈలు శ్రీనివాసులు, రవిశంకర్, గురురాజు, ప్రభాకర్ రావు, శ్రీనివాసులు నాయుడు, చంద్రశేఖర్, సాయి శంకర్, వెంకటసుబ్బయ్య, ఏఈలు, తదితరులు పాల్గొన్నారు.