Homeఇంటర్ ఫలితాల్లో ప్రభంజనం

ఇంటర్ ఫలితాల్లో ప్రభంజనం

- Advertisement -

ప్రథమ సంవత్సరం 77, ద్వితీయ 81 శాతం ఉత్తీర్ణత
. కృష్ణాజిల్లా ప్రథమ స్థానం కైవసం
. 2, 3 స్థానాల్లో గుంటూరు, ఎన్టీఆర్
. చివరికి పరిమితమైన అన్నమయ్య
. సత్తా చాటిన బాలికలు
. ఎక్స్‌లో ఫలితాలు ప్రకటించిన మంత్రి లోకేశ్

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి : ఇంటర్మీడియట్ మార్చి 2026 ఫలితాల్లో ప్రభంజనం నెలకొంది. 12 ఏళ్ల చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఇంటర్ ఉత్తీర్ణతా శాతం నమోదయింది. ఈ ఏడాది ఇంటర్ ఫలితాల్లో విద్యార్థులు గరిష్ఠ స్థాయిలో ఉత్తీర్ణత సాధించడం ఒక ప్రత్యేకత. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాలను బుధవారం ఉదయం 10.31 గంటలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ‘ఎక్స’ వేదికగా విడుదల చేశారు. తాజా ఫలితాలో దాదాపు అన్ని జిల్లాల్లోనూ బాలికలే టాపర్లుగా నిలిచారు. జిల్లాల వారీగా చూస్తే… ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో కృష్ణాజిల్లా అత్యధికంగా ఉత్తీర్ణత శాతం నమోదు చేసింది. ఏకంగా 92 శాతం మార్కులతో ఆ జిల్లా సత్తా చాటింది. రెండో స్థానంలో గుంటూరు 88 శాతం, ఎన్టీఆర్ జిల్లా 87 శాతం మార్కులతో అదరగొట్టాయి. చివరి స్థానంలో అన్నమయ్య జిల్లా 62 శాతానికే పరిమితమైంది. ప్రథమ సంవత్సర ఫలితాల్లో మొదటి స్థానంలో కృష్ణా 90 శాతం, గుంటూరు 88 శాతం, విశాఖపట్నం 85 శాతంతో నిలిచింది. ఇక చివరి స్థానంలో అన్నమయ్య జిల్లా నిలిచింది.
ఇంటర్ ప్రథమ సంవత్సర (జనరల్) పరీక్షల్లో బాలికలు 2,42,956 మంది రాయగా… వారిలో 1,95,667 మంది (81 శాతం) ఉత్తీర్ణత పొందారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం 2,31,917 మంది బాలికలు పరీక్షలు రాయగా… వారిలో 1,96,012 మంది (85 శాతం) ఉత్తీర్ణత పొందారు. ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షల్లో బాలురు 2,28,908 మంది రాయగా… వారిలో 1,65,859 మంది (72 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరం 2,14,620 మంది పరీక్షలు రాయగా… వారిలో 1,63,804 మంది (76 శాతం) మంది ఉత్తీర్ణత పొందారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 5,10,307 మంది, ద్వితీయ సంవత్సరం 5,05,609 మంది విద్యార్థులు (జనరల్, ఓకేషనల్) పరీక్షలు రాశారు. మొత్తం10,15,916 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా… ప్రథమ సంవత్సరంలో 77 శాతం, ద్వితీయ సంవత్సరం 81 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఒకేషన్‌లో ద్వితీయ సంవత్సరం 74 శాతం, ప్రథమ సంవత్సరం 61 శాతం చొప్ప్పున ఉత్తీర్ణులయ్యారు. ప్రథమ సంవత్సర ఒకేషన్‌లో 8,141 మంది (49 శాతం) బాలురు, 15,428 (71 శాతం) మంది బాలికలు ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సర ఒకేషనల్‌లో బాలురు 8,338 మంది (62 శాతం), బాలికలు 16,813 (83 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ప్రభుత్వ రంగం, అనుబంధిత సంక్షేమ కళాశాలల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరం 77 శాతం, ద్వితీయ సంవత్సరం 81 శాతం చొప్ప్పున నమోదయింది.
ఈ ఏడాది ఫలితాల్లో అత్యధిక ఉత్తీర్ణత : మంత్రి నారా లోకేశ్
ఇంటర్ విద్యార్థులకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అభినందనలు తెలిపారు. ఈ ఏడాది ఇంటర్ ఫలితాల్లో గరిష్ఠ ఉత్తీర్ణత నమోదయిందని, 12 సంవత్సరాలలో ఎన్నడూలేని విధంగా అత్యధిక ఉత్తీర్ణత శాతాన్ని విద్యార్థులు సాధించినట్లు మంత్రి ఆనందం వ్యక్తం చేశారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 77 శాతం, ద్వితీయ సంవత్సరంలో 81 శాతం ఉత్తీర్ణత నమోదయినట్లు ఆయన తెలిపారు. ఇది 12 ఏళ్ల కంటే అత్యధికమని పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రభుత్వ-నిర్వహణ సంస్థలలో చదువుతున్న విద్యార్ధులు గణనీయంగా ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు.
మే 21 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ
ఇంటర్మీడియట్ 2026 సప్లిమెంటరీ పరీక్షలు మే 21 నుంచి ప్రారంభమై జూన్ 4 వరకు కొనసాగుతాయి. ప్రతిరోజూ ఈ పరీక్షలు రెండు సెషన్లలో జరుగుతాయి. మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు కొనసాగుతాయి.
ఫెయిల్ అయిన విద్యార్థులతో పాటు ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు రాయాలనుకునే వారికి ప్రాక్టికల్ పరీక్షలు జూన్ 7, 2026 నుంచి జూన్ 11, 2026 వరకు జిల్లా ప్రధాన కేంద్రాలలోనే నిర్వహిస్తారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో అన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు మాత్రమే ఇంప్రూవ్‌మెంట్ అవకాశం కల్పిస్తారు. ద్వితీయ సంవత్సర విద్యార్థులు ప్రాక్టికల్స్ లేదా ఇతర సబ్జెక్టుల్లో ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలకు హాజరు కావాలంటే, ముందుగా గతంలో పొందిన మార్కులను రద్దు చేసుకోవాల్సి ఉంటుంది. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్షను జూన్ 5, 2026 న, ఎన్విరాన్‌మెంట్ ఎడ్యుకేషన్ పరీక్షను జూన్ 6, 2026 న నిర్వహించనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర సప్లిమెంటరీ, ఇంప్రూవ్‌మెంట్, రీ వెరిఫికేషన్‌కు సంబంధించిన ఫీజుల చెల్లింపునకు ఈ నెల 20 నుంచి 27 లోగా గడువు విధించింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు