28న వైసిపి ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం
— మాజీ ఎంపీ భరత్ రామ్
విశాలాంధ్ర – రాజమండ్రి సిటి ; రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కళాశాలలను ప్రయివేటు పరం చేయడాన్ని నిరసిస్తూ, ఈ నెల 28వ తేదీన ప్రజా ఉద్యమాన్ని చేపడుతున్నట్లు మాజీ ఎంపీ భరత్ రామ్ స్పష్టం చేశారు. శనివారం మధ్యాహ్నం స్థానిక విఎల్ పురంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిసిగ్గుగా ప్రజా ధనాన్ని ప్రయివేటు పాలు చేస్తుందన్నారు. కూటమి నాయకులకు పోలీసులు కూడా వత్తాసు పలుకుతూ, వారికి అడుగులకు మడుగులు ఎత్తుతున్నారన్నారు. నేడు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అనేక అమాయక ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నాయన్నాయని, నిన్నటికి నిన్న ఓ ప్రయివేటు ట్రావెల్స్ కు చెందిన ఓల్వో బస్సు దగ్ధమై 19 మంది అమాయకులు మరణించినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేదన్నారు. ఆ ప్రయివేటు ఓల్వో బస్సు సంవత్సరం కాలం నుంచి ఫిట్ నెస్ సర్టిఫికెట్ లేకుండా ప్రయాణీకులను తీసుకెళ్ళడం అత్యంత దుర్మార్గమని, ఈ విషయంలో ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వం ఏం చేస్తుందని ఆయన ప్రశ్నించారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా డ్రైవ్ చేస్తే ఇలా ఫిట్ నెస్ సర్టిఫికెట్లు లేకుండా నడుస్తున్న వాహనాలు వేలకొద్దీ ఉంటాయని, అలాంటపుడు ప్రమాదాలు జరుగకుండా ఎలా ఉంటాయని, ఈ ప్రమాదాలకు ప్రభుత్వం కారణం కాదా అని ఆయన ప్రశ్నించారు. దీనిని సుమోటాగా తీసుకుని ప్రభుత్వం పైన, ప్రభుత్వాధికారులపైన సుప్రీంకోర్టులో కేసులు వేయాలన్నారు. అలాగే ఆ ఓల్వో బస్సుకి ఇన్సూరెన్సేలేదన్నారు. ఇలాంటి ఘటనలకు కారణమవుతున్న ప్రభుత్వానికి పాలించే నైతిక హక్కు లేదన్నారు. నేడు రాష్ట్రంలో మహిళలకు రక్షణే లేకుండా పోయిందని, మహిళలు, చిన్నారులపై దాడులు, అత్యాచారాలు జరుగుతున్నా పట్టించుకున్న నాధుడు లేడన్నారు. ఇటీవల స్థానిక గణేష్ చౌక్ లోని బీసీ బాలికల హాస్టల్ లో ఓ మైనర్ బాలికపై అత్యాచారం జరిగిన కేసుకు సంబందించి తాము ధర్నా చేస్తే తమపై అక్రమంగా కేసులు పెట్టారన్నారు. ఈ క్రమంలో హాస్టల్ ఎదురుగా ఉన్న ఈవిఎం ఎమ్మెల్యే పోస్టర్ పై కడుపు మండి ఓ బీసీ మహిళ అను యాదవ్ పేడ చల్లితే ఆమెను బలవంతంగా అరెస్టు చేసి మూడు గంటల పాటు హైడ్రామా ఆడారన్నారు. తమకీ విషయం తెలిసి పోలీస్ స్టేషన్ దగ్గరకి వెళ్ళి నిలిదీస్తే 41 నోటీసు ఇచ్చి 26వ తేదీన ఇన్వెస్టిగేషన్ కి రమ్మనమని చెప్పి , తిరిగి లోపలికి పిలిచి సిఐ ఇంటరాగేషన్ చేస్తానని చెప్పడం కక్ష సాధింపు కాదా అని ఆయన ప్రశ్నించారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎంత దారుణంగా ఉందో దీనిని బట్టి అవగతమవుతుందన్నారు. ఈవీఎం ఎమ్మెల్యే గొప్ప నాయకుడు కాదని, స్వాతంత్ర సమరయోధుడు అసలే కాదని, చేసిన తప్పుకు కడుపు మండిన ఏ మహిళైనా ఇలానే పేడ చల్లడం అత్యంత సహజమన్నారు. ఈ రోజున ఇలాంటి దారుణాలు పెరిగిపోవడానికి మద్యం ఏరులై పారడమేనన్నారు. నేడు నగరంలో 24 గంటలు మద్యం ఏరులై పారుతుందని, కల్తీ మద్యానికి హద్దే లేకుండా పోయిందన్నారు. ఇక సాక్షాత్తు ఎమ్మెల్యే బినామీ వాయిస్ రికార్డును తాము బయటకు తీసుకొచ్చినా అతని మీద ఎలాంటి చర్యలు లేవన్నరు. ఇలాంటి దారుణాలు జరుగుతుంటే అల్లర్లు, అఘాయిత్యాలు జరుగకుండా ఎలా ఉంటాయన్నారు. దీనికి తోడు రాజమండ్రిలో విచ్చలవిడిగా పేకాట క్లబ్లు నడుస్తున్నాయని, మద్యం , భూసెటిల్ మెంట్లు, స్సాలు, వ్యభిచారం లాంటివన్నీ ఈవిఎం ఎమ్మెల్యే అండదండలతోనే జరుగుతున్నాయన్నారు. ఇక చంద్రబాబు నాయుడు నోరెత్తితే తాను మైక్రోసాప్ట్ ను ప్రారంభించానని గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. అసలు హైద్రాబాద్ కు ఏం చేసినా అది వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే చేశారని, శంషాబాద్ ఎయిర్ పోర్టు, అవుటర్ రింగ్‌రోడ్డు, పివి నరసింహారావు ఫ్లై ఓవర్ ఇవన్నీ వైఎస్ హయాంలోనే జరిగాయని, ఇక చంద్రబాబు నాయుడు హైద్రాబాద్ కు చేసిందేమిటన్నారు. చంద్రబాబు నాయుడు చెప్పేవన్నీ అబద్దాలేనని, మావని ముంచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు నేడు గొప్పలు చెప్పుకుంటున్నాడన్నారు. ఇక ఈవీఎం ఎమ్మెల్యే నీతి సూత్రాలు వల్లించడంలో సిద్ధ హస్తుడన్నారు. తండ్రీ కొడుకులు బుచ్చియ్య చౌదరికి అన్యాయం చేశారని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే , కాళ్ళావేళ్ళా పడితే తమ నాయకుడు జగన్ కనికరించి ఎమ్మెల్సీ పదవినిచ్చారని, కానీ ఈవిఎం ఎమ్మెల్యే తన బుద్ది చూపించుకుని అధికారంలో ఉన్న దేశంలో చేరి ఇపుడు నీతి వాక్యాలు వల్లిస్తున్నాడన్నారు. రాజమండ్రి ఎమ్మెల్యేకు సభ్యత సంస్కారం లేదని, అతను ఏం మాట్లాడుతున్నాడో కూడా స్థాయిని మరచి మాట్లాడుతున్నాడని, ఆయన గారి హయాంలో బ్లేడు బ్యాచ్‌లో పేకాటరాయుళ్ళు , కల్తీ మద్యంగాళ్ళు పెరిగిపోయినా సభ్యత సంస్కారం లేకుండా సన్నాసి ఎమ్మెల్యే బిహేవ్ చేస్తున్నాడన్నారు. ఈ సంవత్సరంన్నర కాలంలో తాము ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ఉంటే తన మీద కేసులు కడుతున్నారని, గోదావరి నది కలుషితమయ్యిందని ప్రశ్నిస్తే మనోభావాలు దెబ్బతిన్నాయని ఓ కేసు, మెడికల్ కాలేజీలను ప్రయివేటు పరం చేయొద్దంటే దాని మీద కేసు, ఓ బీసీ మహిళకు అన్యాయం జరిగింది స్టేషన్లో నిర్బందించడం ఏమిటని ప్రశ్నించినందుకు కేసు , ఇలా ఈ ఏడాదిగా తన మీద మొత్తం ఆరు కేసులు కట్టారన్నారు. ఎన్ని కేసులు వేసినా తాను చలించేది లేదని , ప్రజల కోసం, ప్రజల పక్షాన పోరాడతానని ఆయన స్పష్టం చేశారు. పోలీసులు కూడా ప్రభుత్వ తొత్తుల్లా పని చేయకుండా నిజాయితీగా పనిచేయాలని ఆయన సూచించారు. మీరు ఎన్ని ఎత్తులు వేసినా ఎన్ని కేసులు పెట్టుకున్నా చలించేది లేదని, ప్రజల పక్షాన పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని, ఈవిఎం ఎమ్మెల్యేలా తాను నీతిమాలిన రాజకీయాలు చేయనని, తాను ఏం చేసినా స్ట్రెయిట్ గానే పోరాడతానన్నారు. ఈవిఎం ఎమ్మెల్యే తమ పార్టీలోని కొంతమందితో కుమ్మక్కై రాజకీయాలు చేస్తున్నాడని,ఆ పాపాలన్నీ త్వరలోనే బయట పెడతానని, ఎవరెవరితో మాట్లాడిందీ, ఎవరెవరితో మంతనాలు సాగించిందీ, ఎన్ని అరాచకాలు చేస్తున్నదీ త్వరలోనే బయటపెడతానని, అస్సలు తాను వదిలే ప్రసక్తే లేదని , దానికి ఈవిఎం ఎమ్మెల్యే సిద్ధంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు రౌతు సూర్య ప్రకాశరావు, గూడూరి శ్రీనివాస్, మజ్జి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.


