కోడ్ భాష, మారుపేర్లతో సియా, చేతన్ మధ్య సంభాషణలు
నార్కో పరీక్షకు నిరాకరించిన నిందితులు
పుణే వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు దర్యాప్తు ముందుకెళుతోన్న కొద్దీ విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితురాలు సియా గోయల్‌కు చెందినట్లు చెబుతున్న స్నాప్‌చాట్ చాటింగ్ ఇప్పుడు కీలకంగా మారింది. ‘‘ఎప్పటికీ జరగని పెళ్లి కోసం టికెట్ బుక్ చేయాలంటే నీ ఆధార్ కార్డు పంపు్ణ్ణ అంటూ సియా తన స్నేహితురాలికి మెసేజ్ పంపినట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి.
ఈ చాట్ నిజమైనదేనా? హత్యకు ముందు పక్కా ప్రణాళికలో భాగమేనా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లి ఏర్పాట్లు కొనసాగుతున్నాయనే భావన కల్పించి అనుమానాలు రాకుండా చేసేందుకే విమాన టికెట్లు బుక్ చేయాలని భావించినట్లు అనుమానిస్తున్నారు. అయితే ఈ చాట్ ప్రామాణికత ఇంకా నిర్ధారణ కాలేదని అధికారులు స్పష్టం చేశారు. పోలీసుల దర్యాప్తులో మరో కీలక విషయం బయటపడింది. సియా గోయల్, చేతన్ చౌదరి తమ ఫోన్లలో కోడ్ భాష, మారుపేర్లతో మాట్లాడినట్లు డిలీట్ చేసిన డేటా రికవరీలో గుర్తించారు. దర్యాప్తును తప్పుదారి పట్టించేందుకే ఈ పద్ధతి అనుసరించినట్లు భావిస్తున్నారు.
ఇద్దరినీ ఎదురెదురుగా కూర్చోబెట్టి విచారించేందుకు మరో మూడు రోజుల పోలీసు కస్టడీ ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు. అయితే కోర్టు ఆ అభ్యర్థనను తిరస్కరించింది. దీంతో సియా, చేతన్‌లను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.
విచారణ సందర్భంగా నార్కో పరీక్ష అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. నిందితులు అంగీకరించకపోవడంతో కోర్టు నార్కో పరీక్షకు అనుమతి నిరాకరించింది. నార్కో పరీక్ష అవసరం లేదని ప్రాసిక్యూషన్ కూడా తెలిపింది.


