ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. గత 12 ఏళ్లలో తొలిసారి రికార్డు స్థాయి ఉత్తీర్ణత నమోదైంది. ప్రథమ ఇంటర్లో 77శాతం, ద్వితీయ ఇంటర్లో 81శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన బుధవారం ఇంటర్ ఫలితాలను ‘ఎక్స్‌్ణ వేదికగా విడుదల చేశారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ప్రథమ ఇంటర్లో 54శాతం, ద్వితీయ ఇంటర్లో 68 శాతం ఉత్తీర్ణతతో మెరుగైన ఫలితాలు వచ్చాయని హర్షం వ్యక్తం చేశారు. ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు చెప్పారు.
ఇంటర్ ఫలితాలకు సంబంధించి రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు ఏప్రిల్ 20- 27 వరకు అవకాశం
మే 21 నుంచి జూన్ 4 వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు (రెండు సెషన్లలో)
జూన్ 7 నుంచి 11 వరకు జిల్లా హెడ్ క్వార్టర్స్‌లోనే ప్రాక్టికల్ పరీక్షలు
పరీక్ష ఫీజును ఏప్రిల్ 20 నుంచి 27వరకు కాలేజీల్లోనే చెల్లించుకోవచ్చు.
కృష్ణా టాప్.. అన్నమయ్య జిల్లా లాస్ట్!
ఏపీ ఇంటర్ ప్రథమ, ద్వితీయ ఇంటర్ ఫలితాల్లో కృష్ణా జిల్లా అగ్రస్థానంలో నిలవగా.. అన్నమయ్య జిల్లా ఆఖరి స్థానంలో ఉంది. ద్వితీయ ఇంటర్లో కృష్ణా 92 శాతం, గుంటూరు 88%, ఎన్టీఆర్ జిల్లా 87శాతం ఉత్తీర్ణతతో అగ్రస్థానంలో నిలవగా.. అన్నమ్య జిల్లా 67శాతంతో ఆఖరి స్థానంలో ఉంది. ప్రథమ ఇంటర్లో కృష్ణా (90%), గుంటూరు (88%), విశాఖ (85%) అగ్రస్థానంలో నిలవగా.. అన్నమయ్య జిల్లా 77శాతంతో ఆఖరి స్థానంలో ఉంది.
ఇంటర్ పరీక్షల్లో బాలికలే పైచేయి
ఫిబ్రవరి 23 నుంచి మార్చి 25వరకు జరిగిన ఇంటర్ పరీక్షల్లో బాలికలే పైచేయి సాధించారు. ప్రథమ ఇంటర్ (జనరల్ కేటగిరీ)లో 4,71,864మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 3,61,526మంది (77%) ఉత్తీర్ణత సాధించారు. ప్రథమ ఇంటర్లో బాలుర ఉత్తీర్ణత 72శాతం కాగా.. బాలికల ఉత్తీర్ణత శాతం 81శాతంగా ఉంది. ద్వితీయ ఇంటర్ పరీక్షలను మొత్తంగా 4,46,537మంది రాయగా.. 3,59,816 (81%)మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలుర ఉత్తీర్ణత శాతం 76శాతం ఉండగా.. బాలికల్లో ఉత్తీర్ణత 85శాతంగా నమోదైంది.


