ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతున్న సమాచారంపై ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) తీవ్రంగా స్పందించింది. ఉద్యోగ నియామకాలకు సంబంధించి వైరల్ అవుతున్న షెడ్యూల్ పూర్తిగా అవాస్తవమని, దానిని తాము విడుదల చేయలేదని స్పష్టం చేసింది. నిరుద్యోగ యువత ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని కమిషన్ ప్రకటించింది. గత రెండు రోజులుగా ఏపీపీఎస్సీ పేరుతో కొన్ని నోటిఫికేషన్ల షెడ్యూల్స్, డాక్యుమెంట్లు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని కమిషన్ తెలిపింది. నియామక షెడ్యూళ్లు, పరీక్షలు, ఫలితాలు, ఎంపికలకు సంబంధించి ధ్రువీకరణ లేని, తప్పుదోవ పట్టించే సమాచారాన్ని నమ్మవద్దని అభ్యర్థులకు సూచించింది. వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి మాధ్యమాల్లో వచ్చే సమాచారాన్ని ఇతరులకు షేర్ లేదా ఫార్వార్డ్ చేయవద్దని కోరింది. ఏదైనా సమాచారం కోసం కేవలం కమిషన్ అధికారిక వెబ్‌సైట్ అయిన జూsc.aజూ.స్త్రశీఙ.ఱఅ ను మాత్రమే సంప్రదించాలని స్పష్టం చేసింది.
వాస్తవానికి ఈ ఏడాది ఉగాది పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ఈ క్యాలెండర్‌ను ప్రకటించారు. ఏయే తేదీల్లో నోటిఫికేషన్లు వస్తాయి, ఎన్ని పోస్టులు భర్తీ చేస్తారు వంటి వివరాలను అందులో పొందుపరిచారు. ఈ పోస్టులన్నింటినీ నిర్దేశిత సమయంలోనే భర్తీ చేస్తామని మంత్రి లోకేశ్ కూడా గతంలో హామీ ఇచ్చారు. అయితే, ఈ అధికారిక క్యాలెండర్‌కు సంబంధం లేకుండా కొందరు ఆకతాయిలు నకిలీ షెడ్యూల్స్ సృష్టించి గందరగోళం సృష్టిస్తున్నారని ఏపీపీఎస్సీ వర్గాలు భావిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని ఏపీపీఎస్సీ నొక్కి చెబుతోంది. సోషల్ మీడియాలో కనిపించే ప్రతి సమాచారాన్ని గుడ్డిగా నమ్మకుండా, అధికారిక ప్రకటనల కోసం వేచి చూడటం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. నియామక ప్రక్రియకు సంబంధించిన ప్రతి అప్‌డేట్‌ను ఏపీపీఎస్సీ తన వెబ్‌సైట్ ద్వారానే అధికారికంగా వెల్లడిస్తుంది.


