– మంత్రి సత్యకుమార్ యాదవ్
విశాలాంధ్ర ధర్మవరం; ప్రజా సమస్యల పరిష్కారమే ఎన్డీఏ ప్రభుత్వ ప్రాధాన్యమని ధర్మవరం ఎమ్మెల్యే, ఆరోగ్య శాఖామంత్రి సత్య కుమార్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ఎన్డీఏ కార్యాలయంలో నిర్వహించిన జనతా వారధి కార్యక్రమంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్య శాఖామాత్యులు, ధర్మవరం శాసనసభ్యులు సత్యకుమార్ యాదవ్, ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజలకు – ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచి ప్రతి సమస్యకు సత్వర పరిష్కారం చూపాలనే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ధర్మవరం నియోజకవర్గంలోని వివిధ గ్రామాలు, వార్డులు, పట్టణ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్, ప్రతి వినతిని ఓర్పుతో విని, సమస్యల స్వరూపాన్ని సంబంధిత అధికారులతో చర్చించి త్వరితగతిన పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా ప్రతి అర్జీపై ప్రత్యేకంగా పర్యవేక్షణ కొనసాగించాలని అధికారులకు సూచించారు. భూ సమస్యలు, రెవెన్యూ అంశాలు, తాగునీటి సమస్యలు, రహదారులు, విద్యుత్, సంక్షేమ పథకాల అమలు, పింఛన్లు, రేషన్ కార్డులు, ఆరోగ్య సేవలు తదితర అంశాలకు సంబంధించిన వినతులను మంత్రి స్వీకరించి, వాటిని సంబంధిత శాఖలకు పంపించి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజాప్రతినిధిగా ప్రతి ఒక్కరి సమస్య తన సమస్యగానే భావిస్తానని పేర్కొన్నారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా వారి సమస్యలను నేరుగా స్వీకరించి పరిష్కరించేందుకు జనతా వారధి కార్యక్రమం ఒక సమర్థవంతమైన వేదికగా నిలుస్తోందన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజాకేంద్రీకృత పాలనకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, ప్రతి అర్హుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తూనే ప్రజా సమస్యల పరిష్కారాన్ని కూడా వేగవంతం చేస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రజల విశ్వాసానికి అనుగుణంగా మరింత బాధ్యతతో పనిచేస్తూ ధర్మవరం నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి సాకే ఓబులేసు, పట్టణ అధ్యక్షులు జింక చంద్ర, కొంక నాగార్జున, శ్యామ్ రావు, ప్రకాష్ నాయుడు, చంద్రమౌళి, నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అర్జీదారులు పాల్గొన్నారు.


