రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) రక్షణ, సంక్షేమం, అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం అమలును పటిష్ఠంగా పర్యవేక్షించేందుకు రూపొందించిన నాలుగంచెల కార్యాచరణ ప్రణాళికపై అధికారులు ఈ సమావేశంలో ముఖ్యమంత్రికి వివరించారు. అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో శనివారం ఈ సమావేశం జరిగింది.ఎస్సీ, ఎస్టీ వర్గాల రక్షణ, సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ఈ కార్యాచరణను రూపొందించినట్లు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రస్థాయిలో ప్రత్యేకంగా ఃఎస్సీ, ఎస్టీ ప్రొటెక్షన్ సెల్ః ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. దీనితో పాటు రాష్ట్ర, జిల్లా, డివిజన్ స్థాయిల్లో విజిలెన్స్ కమిటీలను ఏర్పాటు చేసి, చట్టం అమలు తీరును నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు. 2026 సంవత్సరంలో ఇప్పటివరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద 810 కేసులు నమోదు కాగా, వాటన్నింటినీ పరిష్కరించినట్లు అధికారులు సమావేశంలో వెల్లడించారు. ఈ కేసుల విచారణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 14 ప్రత్యేక సెషన్స్ కోర్టులు, ఒక ప్రత్యేక కోర్టు పనిచేస్తున్నాయని తెలిపారు. 2023 నుంచి 2026 ఆగస్టు వరకు 1,478 కేసుల్లో బాధితులకు రూ. 15.43 కోట్ల పరిహారాన్ని అందించినట్లు వివరించారు.
ఈ ఉన్నతస్థాయి సమావేశంలో మంత్రులు డీబీవీ స్వామి, వి. అనిత, జి. సంధ్యారాణి, ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల ఎంపీలు కృష్ణప్రసాద్, దగ్గుమళ్ల ప్రసాద్, పలువురు ఎమ్మెల్యేలు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. హోంశాఖ కార్యదర్శి కుమార్ విశ్వజీత్, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యనార్, న్యాయశాఖ అధికారులు హాజరయ్యారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల కోసం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల పర్యవేక్షణను మరింత బలోపేతం చేయడంపై కూడా సమావేశంలో చర్చించారు.


