. 15 నుంచి ఉచిత ప్రయాణం
. 5 రకాల బస్సుల్లో అవకాశం
. ఏ4 మద్యం దుకాణాలకు పర్మిట్ రూమ్‌లు
. నాయీ బ్రాహ్మణులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్
. జర్నలిస్టుల అక్రిడిటేషన్‌ల కమిటీలో యూనియన్లకు ప్రాతినిధ్యం
. రాష్ట్ర మంత్రివర్గం మరిన్ని కీలక నిర్ణయాలు
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో మరో కీలక హామీకి రాష్ట్ర మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని ఈ నెల 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకం అమలు చేసేందుకు తీర్మానించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో బుధవారం జరిగిన 27 వ ఇ-క్యాబినెట్ సమావేశంలో మొత్తం 17 అంశాలపై చర్చించింది. వీటిలో ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణంతో పాటు నూతన బార్ పాలసీ, మరికొన్ని కీలక నిర్ణయాలు ఉన్నాయి. మంత్రివర్గ సమావేశ నిర్ణయాలను రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారధి మీడియాకు వివరించారు. మంత్రి చెప్పిన వివరాల ప్రకారం రాష్ట్రంలో 5.25 కోట్ల జనాభా ఉండగా, అందులో 2.62 కోట్ల మంది మహిళలు ఉన్నారు. వీరిలో బాలికలు, మహిళలు, ట్రాన్స్‌జెండర్లు కూడా ఉన్నారు. వీరందరికీ ఈ నెల 15 నుంచి ఆర్టీసీలో ఎక్కడ నుంచి ఎక్కడికైనా రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించవచ్చు, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్ వంటి 5 రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తారు. ఈ సౌకర్యం వినియోగించుకునేందుకు వీరు ఆధార్, ఓటర్, రేషన్ కార్డులను గుర్తింపు కార్డులుగా చూపించాల్సి ఉంటుంది. ఈ పథకం నాన్ స్టాప్, అంతర్ రాష్ట్రీయ బస్ సర్వీసులు, ఇతర కేటగిరీలకు వర్తించదు. అలాగే కాంట్రాక్టు క్యారేజ్ సర్వీసులు, చార్టెడ్ సర్వీస్‌లకు, ప్యాకేజ్ టూర్లకు వర్తించదు. రాష్ట్రంలో ఉన్న బస్సుల్లో 74 శాతం బస్సులు అంటే 6,700 బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు అవకాశం కల్పించడం జరగనుంది. ఈ పథకం అమలుకు నెలకు రూ.162 కోట్ల చొప్పున ఏడాదికి దాదాపు రూ.1,942 కోట్ల వ్యయం కానున్నట్లు ఆర్టీసీ అంచనా వేసింది. రాష్ట్రంలో రోజుకు దాదాపు 26.95 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. ఈ ఏడాది అదనంగా 3 వేల విద్యుత్ బస్సుల కొనుగోలుకు చర్యలు చేపట్టాలని, వచ్చే రెండేళ్లలో మరో 1,400 ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేయాలని, డిమాండుకు తగ్గట్టుగా డ్రైవర్లు, మెకానిక్‌ల నియామకాలను కూడా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి వివరించారు. మహిళలు, బాలికల భద్రతను దృష్టిలో పెట్టుకుని మహిళా కండక్టర్లకు బాడీ కెమెరాలు, బస్సులలో సీసీ కెమెరాలు అమర్చనున్నారు. బస్ స్టేషన్లలో ఫ్యాన్లు, మంచి నీటి సౌకర్యం వంటి మౌలిక వసతులు అదనంగా కల్పిస్తారు. ప్రస్తుతం ఆయా సర్వీసుల్లో 16.11 లక్షల మంది మహిళలు ప్రయాణిస్తుండగా, ఉచిత ప్రయాణ సౌకర్యం వల్ల అదనంగా 10.84 లక్షల మంది వినియోగించుకునే అవకాశం ఉన్నట్టు అంచనా వేయగా, సంవత్సరానికి 142 లక్షల మంది మహిళలు ఈ ఉచిత బస్సు సౌకర్యాన్ని వినియోగించుకోనున్నట్లు మంత్రి వెల్లడిరచారు.
మంత్రివర్గం తీసుకున్న మరికొన్ని నిర్ణయాలు ఇవీ…
అ ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ హబ్ పాలసీ (4.0) 2024-2029కు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. రాష్ట్ర విభజన అనంతరం హైదరాబాద్ నగరాన్ని కోల్పోవడంతో కొత్త ఆర్థిక కేంద్రాల అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని ఆంధ్ర ప్రదేశ్‌లో మౌలిక సదుపాయాలు, ప్రతిభను సద్వినియోగం చేసుకునేందుకు ఈ విధానం రూపొందించబడిరది.
అ ఆరు క్లస్టర్లకు చెందిన 22 హోటళ్లు, రిసార్టుల నిర్వహణ కార్యకలాపాల నిమిత్తం వీసీ అండ్ ఎండీ, ఏపీటీడీసీ అధికారం ఇవ్వడానికి, ఏజెన్సీలను ఎంపిక చేయడానికి ఆర్‌ఈఎఫ్ ప్రకటనకు అనుమతి ఇవ్వడానికి, యువజనాభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక కార్యక్రమాల శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
అ తిరుపతి గ్రామీణ మండలం ఏపీటీఏ భూమిని టీటీడీ భూమితో బదలాయింపు/ మార్పిడి చేసుకోవడానికి, తిరుపతి ఆర్‌ఎస్ గ్రామంలో 25.00 ఎకరాల టీటీడీ భూమితో ఎక్స్చేంజ్ డీడ్‌ను అమలు చేయడానికి, ఓబెరాయ్ గ్రూప్‌నకు ఇచ్చిన భూమి కేటాయింపును రద్దు చేయడానికి యువజనాభివృద్ధి, పర్యాటక సాంస్కృతిక కార్యక్రమాల శాఖ చేసిన ప్రతిపాదనకు మంత్రివర్గం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
అ 2024-26 లైసెన్స్ కాలం కోసం తిరుపతి దగ్గర ఉన్న పర్మిట్ రూమ్‌లకు లైసెన్స్ కాలాన్ని పొడిగించడానికి ఏపీ ఎక్సైజ్ (గ్రాంట్ ఆఫ్ లైసెన్సెస్) నిబంధనలు, లైసెన్స్ షరతులను సవరించడానికి చేసిన ప్రతిపాదనకు ఆమోదం. గతంలో 2019 వరకు అన్ని ఏ4 మద్యం దుకాణాలకు పర్మిట్ రూమ్‌లు తప్పనిసరిగా ఉండేవి. వాటికి వార్షిక లైసెన్స్ ఫీజుగా రూ.5 లక్షలు వసూలు చేసేవారు. ఇవి నియంత్రిత వాతావరణంలో మద్యం సేవించేవారు. మరలా వాటికి ఇప్పుడు కేబినెట్ సబ్ కమిటీ అన్ని ఏ 4 దుకాణాలకు తిరిగి పర్మిట్ రూమ్‌లు అనుమతించాలని సిఫార్సు చేసింది. వార్షిక రిటైల్ ఎక్సైజ్ టాక్స్ ఆధారంగా రూ.5 నుంచి 7 లక్షల లైసెన్స్ ఫీజు వసూలు చేయాలని, గరిష్టంగా 1000 చదరపు అడుగుల విస్తీర్ణంతో కిచెన్ లేకుండా రెడీ టు ఈట్ స్నాక్స్‌కు మాత్రమే అనుమతి ఇవ్వాలని ప్రతిపాదించింది. ఇది సంవత్సరానికి దాదాపు రూ.256 కోట్లు అదనపు ఆదాయం తెచ్చి, బహిరంగ ప్రదేశాల్లో మద్యపానాన్ని నియంత్రించగలదని సబ్ కమిటీ చేసిన సూచనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అ ఏపీడీసీఎల్ క్లిష్టమైన ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని, ఎస్‌బీఐ, యూబీఐ బ్యాంకులు చట్టబద్ధ అధికారులకు, సీఐబీఐఎల్, సీఆర్‌ఐఎస్‌ఐఎల్ మొదలైన వాటికి ప్రతికూల రిపోర్టింగ్‌ను నివారించడానికి రూ.900 కోట్లకు ప్రభుత్వ గ్యారెంటీ అందించేందుకు నిర్దిష్ట షరతులకు లోబడి చేసిన ప్రతిపాదనకు ఆమోదం. అలాగే రూ.3544.57 కోట్ల మొత్తాన్ని ఏపీసీపీడీసీఎల్‌కి, రూ.1029.37 కోట్ల మొత్తాన్ని మిగిలిన దానికి ప్రభుత్వ హామీని అందించడానికి ఆమోదం అ నాయీ బ్రాహ్మణుల అభ్యర్థన మేరకు హెయిర్ కటింగ్ సెలూన్లకు ప్రస్తుతం ఇచ్చే ఉచిత 150 యూనిట్ల విద్యుత్‌కు బదులు 200 యూనిట్లకు పెంపు. అ ప్రస్తుత ఏపీ మీడియా అక్రిడిటేషన్ నిబంధనలు2023లో జీవో ఎంఎస్ 38ని రద్దు చేసి, దాని స్థానంలో కొత్తగా రూపొందించిన ‘కాంప్రహెన్సివ్ ఏపీ మీడియా అక్రిడిటేషన్ రూల్స్`2025’ ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. దీనిప్రకారం కమిటీల్లో యూనియన్లకు ప్రాతినిధ్యం కల్పిస్తారు. సోషల్ మీడియాకి సంబంధించి కూడా ఒక పాలసీని తీసుకురావాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు మంత్రి సారథి తెలిపారు.
అ మావోయిస్టులపై నిషేధం మరో ఏడాది పొడిగిస్తూ నిర్ణయం
అ పుట్టపర్తి, మొవ్వ, గన్నవరం, గాజువాక, తిరుపతి తదితర ఐదు (5) అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులను రెగ్యులర్ ప్రాతిపదికన మంజూరు
అ కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సుల ఆధారంగా 2025-28 నూతన బార్ పాలసీకి రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం. లాటరీ ద్వారా బార్‌లను కేటాయించాలని, కనీసం నాలుగు దరఖాస్తులు వస్తేనే ఈ విధానాన్ని అనుసరించాలని నిర్ణయించారు. వ్యాపార గంటలను కూడా ఉదయం 10 నుంచి రాత్రి 11 గంటల వరకు అనుమతించాలని, మొత్తం 840 బార్లలో 10 శాతం బార్‌లను కల్లుగీత కార్మికుల సంక్షేమార్థం 50 శాతం ఫీజుతో రిజర్వు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది.
అ ఏపీఐఐసీ ద్వారా ద్వారా రూ.7,500 కోట్ల రుణం సమీకరించి పరిశ్రమల అభివృద్ధికి వినియోగించేందుకు ఆమోదం
అ ఏఎస్‌ఆర్ జిల్లాలోని వై.రామవరం మండలాన్ని ఎగువ వై.రామవరం, దిగువ రామవరంగా రెండు మండలాలుగా విభజన
అ శనివారం జరగనున్న జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని చేనేత కార్మికులకు వివిధ రూపాల్లో రాయితీలు ఇచ్చేందుకు ఆమోదం, ఈ మొత్తం పథకాల అమలుకు ప్రభుత్వం రూ.648.59 కోట్లు ఖర్చు చేయనుండగా, ఇందులో విద్యుత్ మాఫీ, జీఎస్టీ రీయింబర్స్‌మెంట్, త్రిఫ్ట్ ఫండ్, నేతన్న నేస్తం, ఎన్టీఆర్ భరోసా వంటి పథకాలు ఉన్నాయని మంత్రి పార్థసారధి వివరించారు.


