వెండి.. కిలో ధర రూ.4 లక్షలు దాటి ఆల్‌టైం గరిష్ఠానికి చేరి…
దేశీయ మార్కెట్లో పసిడి( gold ) , వెండి (silver) ధరలు అందనంత వేగంగా పరుగులు పెడుతున్నాయి. ఓవైపు బంగారం ధర రూ.2లక్షల దిశగా దూసుకెళుతుంటే, వెండి ధర (Silver Rate) ఫ్యూచర్స్ మార్కెట్లో ఏకంగా రూ.4 లక్షలు దాటి ఆల్‌టైం గరిష్ఠానికి చేరింది. హైదరాబాద్ మార్కెట్లో ఉదయం 10 గంటల సమయంలో 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాముల ధర రూ. 1,85,000 దాటింది. అటు వెండి ధరరూ.4,00,000 పలికింది.
బుధవారం రాత్రి హైదరాబాద్ విపణిలో 10 గ్రాముల మేలిమి (24 క్యారెట్ల) బంగారం ధర రూ.1,73,300గా ఉంది. కొన్ని గంటల్లోనే రూ.12 వేలు పెరగడం గమనార్హం. కిలో వెండి ధర రూ.3,79,700 వద్ద ముగియగా.. నేడు ఏకంగా రూ.21 వేలకు పైగా పెరిగింది. మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజ్లో మార్చి డెలివరీ కాంట్రాక్టుకు ఫ్యూచర్స్‌లో వెండి ధర గురువారం ఒక్కరోజే రూ.22,090 పెరిగి రూ.4,07,456 వద్ద సరికొత్త జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. అటు ఫిబ్రవరి డెలివరీ కాంట్రాక్టుకు బంగారం (Gold) ఫ్యూచర్స్ 10 గ్రాముల ధర కూడా రూ.14,586 పెరిగి రూ.1,80,501కి చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లోనూ ఈ లోహాల ధరలు రికార్డు స్థాయిలో దూసుకెళుతునా్నయి. ఔన్సు వెండి ధర తొలిసారి 5,600 డాలర్ల మార్క్ దాటింది. కమొడిటీ ఎక్స్ఛేంజీలో ఏప్రిల్ డెలివరీకి ఔన్సు ధర 5,626.8 డాలర్లు పలికింది. ఔన్సు వెండి ధర 119.51 డాలర్లకు చేరింది. అమెరికా డాలర్ విలువ బలహీనపడటం, వెండికి పరిశ్రమల నుంచి డిమాండ్ పెరగడంతో వైట్ గోల్డ్‌కు రెక్కలొచ్చాయని బులియన్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక, అంతర్జాతీయ భౌగోళిక, రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో బంగారం, వెండిని సురక్షిత పెట్టుబడి సాధనంగా మదుపర్లు భావిస్తుండటం కూడా ధరల పెరుగుదలకు కారణంగా నిలిచింది.


