నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్న సమయంలో రాజకీయంగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.ఎన్సీపీ (శరద్‌చంద్ర పవార్) అధ్యక్షుడు శరద్ పవార్ బుధవారం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.ఉదయం ప్రధానమంత్రి కార్యాలయానికి చేరుకున్న పవార్‌కు మోదీ స్వయంగా గుమ్మం వద్దకు వెళ్లి ఆత్మీయంగా స్వాగతం పలికారు.
ఈ సమావేశానికి సంబంధించిన ఫొటోలను ప్రధానమంత్రి కార్యాలయం ఎక్స్ వేదికగా పంచుకుంది.
శరద్ పవార్‌తో పాటు ఆయన కుమార్తె, ఎంపీ సుప్రియా సూలే కూడా సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వ్యవసాయ రంగానికి సంబంధించిన ఇబ్బందులపై పవార్ ప్రధానికి వినతిపత్రం అందజేశారు.ఈ అంశాలతో పాటు పలు కీలక విషయాలపై ఇరువురు నేతలు చర్చించినట్లు సమాచారం.
ఎన్సీపీ ఎన్డీఏకు మద్దతు
ఇటీవల ఎన్సీపీ (శరద్‌చంద్ర పవార్) అధికార ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వొచ్చనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.అలాంటి సమయంలో మోదీ-శరద్ పవార్ సమావేశం జరగడం రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.అయితే ఈ భేటీ అనంతరం సుప్రియా సూలే ప్రతిపక్ష పార్టీల సమావేశంలోనూ పాల్గొనడం గమనార్హంగా మారింది.మరోవైపు, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ బిల్లుకు పార్లమెంట్‌లో అవసరమైన రెండొంతుల మెజార్టీ సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది.ఈ నేపథ్యంలో ఎన్సీపీ (శరద్‌చంద్ర పవార్) కూడా ఎన్డీఏకు మద్దతు ఇచ్చే అవకాశాలపై గత కొద్దిరోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఎంవీఏ కూటమిలో అంతర్గత రాజకీయ పరిణామాలపై చర్చ
ఇదిలా ఉండగా, ఇటీవల మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమిలో భాగమైన శివసేన (యూబీటీ)కి చెందిన ఆరుగురు ఎంపీలు ఏక్‌నాథ్ శిందే నేతృత్వంలోని శివసేనలో చేరారు.దీంతో ఎంవీఏ కూటమిలో అంతర్గత రాజకీయ పరిణామాలపై చర్చ మొదలైంది.ఈ పరిణామాల మధ్య శరద్ పవార్ కూడా శిందేను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.ఇప్పటికే రెండుగా విడిపోయిన ఎన్సీపీ వర్గాలు మళ్లీ ఒక్కటై, అనంతరం ఎన్డీఏ కూటమిలో కొనసాగవచ్చనే ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.


