Homeఅంతర్జాతీయంహోర్మూజ్‌లో కదులుతున్న నౌకలు

హోర్మూజ్‌లో కదులుతున్న నౌకలు

- Advertisement -


తెహ్రాన్: హోర్మూజ్‌లో నౌకల కదలికలు మొదలయ్యాయి. ఇరాన్-అమెరికా మధ్య ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ప్రపంచ చమురు రవాణాకు జీవనాడిగా పేర్కొనే హోర్మూజ్‌కు మళ్లీ ఊపిరి పోసినట్లయ్యింది. ఆంక్షల నేపథ్యంలో కొంతకాలంగా అక్కడ వందలాది నౌకలు చిక్కుకుపోగా…తాజాగా పరిస్థితులు కుదుటపడడంతో తిరిగి తమ ప్రయాణాన్ని కొనసాగించేందుకు ఆయా నౌకలు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఒప్పందం తక్షణమే అమల్లోకి రావడంతో కొన్ని నౌకలు ఇప్పటికే ఆ మార్గంలో బయలుదేరినట్లు తాజా నివేదికలు పేర్కొంటున్నాయి. నౌకల రాకపోకలను ట్రాకింగ్ చేసే వ్యవస్థ ‘విండ్‌వార్డ్’ ప్రకారం… హోర్మూజ్‌లో సుదీర్ఘ కాలంగా నిలిచిపోయిన నౌకల్లో కొన్ని గురువారం ఉదయమే తమ ప్రయాణాన్ని ప్రారంభించాయి. తొలుత చైనాతో సంబంధమున్న ఐదు నౌకలు కదలగా, యూరోపియన్ జెండాలున్న రెండు నౌకలు తర్వాత క్రమంలో వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ఏడు నౌకలు కూడా గత వంద రోజులకుపైగా హోర్మూజ్ సమీపంలో చిక్కుకుపోయినవేనని సమాచారం.
వీటితోపాటు మరికొన్ని నౌకలు కూడా లంగరు వేసిన ప్రదేశం నుంచి జలసంధి వైపు వెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి. ఇందులో హాంకాంగ్, జపాన్‌కు చెందిన భారీ నౌకలు ఉన్నట్లు తెలిసింది. కాల్పుల విరమణ ఒప్పందం, వ్యూహాత్మక జలమార్గాన్ని తెరవడం వంటి అంశాలపై విశ్వాసం పెరుగుతోందనడాన్ని తాజా పరిణామం సూచిస్తోందని నౌకల ట్రాకింగ్ వ్యవస్థలు అంచనా వేస్తున్నాయి. అయితే, హోర్మూజ్‌లో పూర్తిగా సాధారణ పరిస్థితులు నెలకొనడం అనేది శాంతి ఒప్పందం అమలుపై ఇరుపక్షాల నిబద్ధతపైనే ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు