మహిళల రక్షణ కోసం ప్రత్యేక యాప్ ను అందుబాటులోకి తీసుకురావాలని హోంమంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు. డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, ఇతర పోలీస్ ఉన్నతాధికారులతో రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం మంత్రి సమీక్ష నిర్వహించారు. బడ్జెట్ ప్రాధాన్యతలకు సంబంధించిన అంశాలతో పాటు రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల రక్షణ, తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. హెల్ప్ డెస్కుల ఏర్పాటుపై దిశానిర్దేశం చేశారు.
మార్చి 8న మహిళా దినోత్సవం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా మహిళల రక్షణ కోసం ప్రత్యేక యాప్ ను ప్రారంభించే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అంతకు ముందు విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ఆధ్వర్యంలో సాయి సాధన చిట్ ఫండ్ బాధితులు మంత్రి అనితను కలిశారు.
నరసరావుపేటలో సాయి సాధన చిట్ ఫండ్ ఇటీవల బోర్డు తిప్పేయడంతో సుమారు రూ.200 కోట్ల మేర మోసం జరిగిందని, బాధితుల్లో పేద, మధ్యతరగతి ప్రజలే ఎక్కువగా ఉన్నారని వివరించారు. బాధితులకు సరైన న్యాయం చేయాలని ఎమ్మెల్యే కోరారు. ఘటనలో నిందితులను అరెస్టు చేయడం జరిగిందని, త్వరలోనే బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు. సాయి సాదన చిట్ ఫండ్ కేసు విచారణకు సిట్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.