పుంగనూరు, రాయచోటిలో టీడీపీ- వైఎస్సార్సీపీ పరస్పర దాడులు
నామినేషన్ల తొలిరోజే స్థానిక ఎన్నికలు వేడి రాజుకున్నాయి. నామినేషన్లు దాఖలు వేళ అన్నమయ్య జిల్లాలోని పుంగనూరు, రాయచోటిలో వైఎస్సార్సీపీ , టీడీపీ వర్గాలు పరస్పరం ఘర్షణకు దిగాయి. పుంగనూరులో చెలరేగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. టీడీపీ, వైఎస్సార్సీపీ వర్గాలు ఒకేసారి నామినేషన్లు దాఖలు చేసేందుకు వెళ్తుండగా వారి మధ్య ఘర్షణ చెలరేగింది. రెండు వర్గాలూ పరస్పరం రాళ్లదాడి చేసుకున్నారు. రాళ్లదాడిలో పలువురు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.
రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి భారీ కాన్వాయ్‌తో పుంగనూరు పురపాలక సంఘం అధ్యక్ష పదవికి, వార్డు కౌన్సిలర్లుగా పోటీ చేస్తున్న అభ్యర్థులను, భారీ బలగాన్ని వెంటబెట్టుకొని బయల్దేరారు. మరోవైపు టీడీపీ అభ్యర్థులు కూడా కొందరు నామినేషన్లు వేసేందుకు కార్యాలయానికి వెళ్లారు. ఎంపీ మిథున్‌రెడ్డి కార్యాలయంలోకి వెళ్లడంపై టీడీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు మిథున్‌రెడ్డిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. మిథున్‌రెడ్డి పోలీసుల్ని లెక్కచేయకుండా తన వాహనశ్రేణిని బారికేడ్ల మీదుగా తీసుకెళ్లారు. ఈ క్రమంలో భద్రత బలగాల్లో ఉన్న ఓ పోలీసుకు గాయాలయ్యాయి. దీంతో మిథున్‌రెడ్డి వైఖరిని నిరసిస్తూ టీడీపీ నాయకులు ఆందోళనకు దిగారు.
వాహనాలు ధ్వంసం: మిథున్‌రెడ్డితో పాటు వచ్చిన ఆయన అనుచరులు, వైఎస్సార్సీపీ నాయకులు ఆందోళన చేస్తున్న టీడీపీ నేతలపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడుల్లో పుంగనూరు పట్టణ తెలుగుదేశం అధ్యక్షుడు మధు రాయల్ సహా పలువురు నాయకులు, కార్యకర్తలకు గాయాలయ్యాయి. పట్టణంలోని ఎస్ఎన్ కాలనీలో టీడీపీ- వైఎస్సార్సీపీ కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. పరస్పరం రాళ్లు, కర్రలతో ఇరువర్గాలు దాడికి పాల్పడ్డాయి. కార్లకు నిప్పు పెట్టారు. పలు వాహనాలు ధ్వంసం కాగా పలు కార్లు మంటల్లో దగ్ధమయ్యాయి. పోలీసు వాహనాన్ని ధ్వంసం చేశారు. కానిస్టేబుల్ పెంచలయ్యకు గాయాలయ్యాయి. ఈ ఘటనలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు నేతలకు గాయాలయ్యాయి. కొన్ని వాహనాలు ధ్వంసమయ్యాయి.


