హైదరాబాద్, ఉభయ గోదావరి జిల్లాల ప్రయాణికులకు సమయం ఆదా
రాజధాని అమరావతికి ప్రయాణించేవారికి శుభవార్త. ఇకపై విజయవాడ నగరంలోకి ప్రవేశించి, గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోవాల్సిన అవసరం లేదు. కృష్ణా నదిపై నిర్మించిన 3.11 కిలోమీటర్ల పొడవైన ఆరు వరుసల భారీ వంతెన అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త వారధి ద్వారా విజయవాడ నగరంలోకి ప్రవేశించకుండా, అతి తక్కువ సమయంలో నేరుగా అమరావతికి చేరుకోవచ్చు.ప్రధానమంత్రి పర్యటన, అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభం నేపథ్యంలో ఈ వంతెనను అధికారులు ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. పశ్చిమ బైపాస్‌లో భాగంగా నిర్మించిన ఈ బ్రిడ్జి, అమరావతికి అత్యంత వేగవంతమైన అనుసంధానతను అందిస్తుంది. హైదరాబాద్ వైపు నుంచి వచ్చేవారు గొల్లపూడి వద్ద ఈ వంతెన ఎక్కితే కేవలం ఐదు నిమిషాల్లోనే కృష్ణా నదిని దాటి అమరావతిలోని వెంకటపాలెం చేరుకోవచ్చు. అదేవిధంగా, ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వచ్చేవారు గన్నవరం సమీపంలోని చిన్న అవుటపల్లి వద్ద బైపాస్ ఎక్కి, విజయవాడ ట్రాఫిక్‌తో సంబంధం లేకుండా అరగంటలోపే అమరావతిలోకి ప్రవేశించే వీలు కలిగింది.
ఈ వంతెన నిర్మాణం వల్ల ప్రయాణ సమయం గణనీయంగా ఆదా అవ్వడంతో పాటు, అమరావతి నిర్మాణ పనులకు అవసరమైన భారీ వాహనాలు, నిర్మాణ సామగ్రి రవాణా కూడా సులభతరం కానుంది. ప్రమాదాలకు ఆస్కారం లేకుండా, వేగంగా, సురక్షితంగా ప్రయాణించేందుకు వీలుగా ఇరువైపులా వేర్వేరు మార్గాలు, సూచికలు, డివైడర్లు, లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ కొత్త మార్గం అమరావతి అభివృద్ధికి దోహదపడుతుందని, ప్రయాణికులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని స్థానికులు, ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజధానిలోని సచివాలయం, హైకోర్టు, ఇతర కార్యాలయాలకు వెళ్లే వారికి ఈ వంతెన ఓ వరంలా మారనుంది.