వక్ఫ్ చట్టానికి ఇటీవల చేసిన సవరణల రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు నేడు (గురువారం) విచారణ చేపట్టనుంది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ బి.ఆర్. గవాయ్, జస్టిస్ ఎ.జి. మసీహ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈరోజు ఈ పిటిషన్లపై విచారణను పునఃప్రారంభించనుంది. గతంలో మే 5న జరిగిన విచారణలో అప్పటి సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం.. తన పదవీ విరమణ సమీపిస్తున్నందున మధ్యంతర దశలో తీర్పును రిజర్వ్ చేయదలచుకోలేదని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో విచారణను వాయిదా వేస్తూ, జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు దీనిని విచారణకు ఉంచుతామని పేర్కొంది.
అంతకుముందు విచారణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వక్ఫ్ బోర్డులు తమ ప్రాథమిక సమాధానాలను దాఖలు చేయడానికి సుప్రీంకోర్టు వారం రోజుల గడువు ఇచ్చింది. ఐదు రిట్ పిటిషన్లను ప్రధాన కేసులుగా పరిగణించాలని, ఇతర పిటిషన్లను మధ్యంతర దరఖాస్తులుగా పరిగణించాలని నిర్ణయించింది. ఈ కేసుల విచారణ శీర్షికను ఁఇన్ రీ: ది వక్ఫ్ (సవరణ) చట్టం, 2025ఁగా మార్చాలని రిజిస్ట్రీని ఆదేశించింది.
వక్ఫ్ చట్ట దుర్వినియోగాన్ని నిరోధించడానికి, ప్రభుత్వ ఆస్తుల కబ్జాను అరికట్టడానికి, దేశంలోని వక్ఫ్ బోర్డులు పారదర్శకంగా పనిచేసేలా చూడటానికే సవరణలు చేశామని కేంద్ర ప్రభుత్వం తన ప్రాథమిక అఫిడవిట్‌లో పేర్కొంది. ఁవక్ఫ్ నిబంధనలను దుర్వినియోగం చేసి ప్రైవేటు, ప్రభుత్వ ఆస్తులను కబ్జా చేసినట్లు నివేదికలున్నాయి. 2013లో చేసిన సవరణ తర్వాత వక్ఫ్ ఆస్తుల విస్తీర్ణం 116 శాతం పెరగడం ఆశ్చర్యకరంఁ అని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. చాలా వక్ఫ్ బోర్డులు అత్యంత అపారదర్శకంగా పనిచేస్తున్నాయని, వివరాలను బహిరంగ పరచడం లేదని లేదా పాక్షిక వివరాలనే అప్‌లోడ్ చేశాయని కేంద్రం తన సమాధాన పత్రంలో పేర్కొంది. పాత చట్టంలో సరైన రక్షణ చర్యలు లేకపోవడం వల్ల ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను కూడా వక్ఫ్ ఆస్తులుగా ప్రకటించారని, సెక్షన్లు 3ఏ, 3బీ, 3సీ ఈ పరిస్థితిని చక్కదిద్దుతాయని కేంద్రం వివరించింది.
భారతదేశంలో వక్ఫ్ ఆస్తుల నిర్వహణను పారదర్శకమైన, సమర్థవంతమైన, సమ్మిళిత చర్యల ద్వారా ఆధునికీకరించే లక్ష్యంతో వక్ఫ్ (సవరణ) చట్టం, 2025ను ఆమోదించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ సంస్కరణలు ఇస్లామిక్ విశ్వాసంలోని ఏ మతపరమైన ఆచారాలు లేదా సిద్ధాంతాలను ఉల్లంఘించకుండా, కేవలం ఆస్తుల నిర్వహణ, రికార్డుల నిర్వహణ, పరిపాలనా నిర్మాణాల వంటి లౌకిక, పరిపాలనా అంశాలకు మాత్రమే నిర్దేశించబడ్డాయని వాదించింది. ఇస్లామిక్ చట్టాలు, సంప్రదాయాలలో పాతుకుపోయిన ఃవక్ఫ్ః భావన, మసీదులు, పాఠశాలలు, ఆసుపత్రులు లేదా ఇతర ప్రజా సంస్థల వంటి ధార్మిక లేదా మతపరమైన ప్రయోజనాల కోసం ఒక ముస్లిం చేసిన దానాన్ని సూచిస్తుంది.