తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఆయనతో పాటు గుజరాత్ హైకోర్టు సీజే జస్టిస్ సునీతా అగర్వాల్, ఢిల్లీ హైకోర్టు సీజే జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయల నియామకానికి కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. సుప్రీంకోర్టు కొలీజియం సెప్టెంబర్ 28న చేసిన సిఫార్సుల మేరకు ఈ నియామకాలు జరిగాయి. ఈ విషయాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ కొత్త నియామకాలతో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 37కు చేరుకోనుంది. సుప్రీంకోర్టు సవరణ చట్టం-2026 ప్రకారం, ప్రధాన న్యాయమూర్తితో కలిపి మొత్తం ఆమోదిత సంఖ్య 38 కాగా, ప్రస్తుతం 34 మంది ఉన్నారు. ఈ ముగ్గురి ప్రమాణ స్వీకారంతో ఈ సంఖ్య 37కు పెరుగుతుంది. 1965 జులై 7న జన్మించిన జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, ఢిల్లీ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1990లో పాట్నా హైకోర్టులో న్యాయవాదిగా తన వృత్తిని ప్రారంభించారు. అనంతరం ఝార్ఖండ్ హైకోర్టులో ప్రాక్టీస్ చేసి, 2012లో అదే హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2014లో శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఝార్ఖండ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కూడా సేవలు అందించారు. ఆ తర్వాత త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి, ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక, జస్టిస్ సునీతా అగర్వాల్ నియామకంతో సుప్రీంకోర్టులో మహిళా న్యాయమూర్తుల సంఖ్య మూడుకు పెరగడం గమనార్హం. త్వరలోనే ఈ ముగ్గురు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.


