పిల్లల భవిష్యత్తు కోసం అప్పుల బాటలో తల్లిదండ్రులు…..
విశాలాంధ్ర-నార్పల (అనంతపురం జిల్లా) : – ప్రైవేట్ పాఠశాలల్లో పెరుగుతున్న ఫీజులు, పుస్తకాలు, యూనిఫాంలు, రవాణా ఛార్జీల భారంతో మధ్యతరగతి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. పిల్లల భవిష్యత్తు కోసం నాణ్యమైన విద్య అందించాలని భావిస్తున్న తల్లిదండ్రులు అప్పులు చేయడం, బంగారం తాకట్టు పెట్టడం, ఇతర కుటుంబ అవసరాలను తగ్గించుకోవడం వంటి పరిస్థితులకు దిగజారుతున్నారు.నేటి పోటీ ప్రపంచంలో తమ పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించి మంచి స్థాయికి చేరుకోవాలనే ఆశతో ఎక్కువ మంది తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలలనే ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపడుతున్నప్పటికీ, సమాజంలో పెరిగిన పోటీ భావన కారణంగా ప్రైవేట్ విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒకరి పిల్లలు ప్రైవేట్ పాఠశాలలో చదువుతుండటాన్ని చూసి మరొకరు కూడా అదే మార్గాన్ని ఎంచుకుంటుండటంతో కుటుంబాలపై అదనపు ఆర్థిక భారం పడుతోంది.
ప్రైవేట్ పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, యూనిఫాంలు తదితర విద్యా సామగ్రిని పాఠశాలల ద్వారానే కొనుగోలు చేయాల్సి వస్తోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్‌లో తక్కువ ధరలకు లభించే వస్తువులు పాఠశాలల ద్వారా అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో విద్యా ఖర్చులు మరింత పెరిగి కుటుంబ బడ్జెట్‌పై ప్రభావం చూపుతున్నాయని పేర్కొంటున్నారు.
పిల్లల చదువుల కోసం నెలవారీ ఆదాయంలో గణనీయమైన భాగాన్ని వెచ్చించాల్సి వస్తోందని, ఫీజుల చెల్లింపుల కోసం అప్పులు చేయడం తప్ప మరో మార్గం కనిపించడం లేదని పలువురు తల్లిదండ్రులు చెబుతున్నారు. పెరుగుతున్న విద్యా వ్యయాలు మధ్యతరగతి కుటుంబాలను తీవ్ర ఆర్థిక ఒత్తిడికి గురిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో మండల విద్యాశాఖాధికారి (ఎంఈఓ)తో పాటు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు స్పందించి ఫీజులు అందరికీ భరించగలిగే స్థాయిలో ఉండేలా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. అలాగే పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, ఇతర విద్యా సామగ్రి సరసమైన ధరలకు అందుబాటులో ఉండేలా పర్యవేక్షణ పెంచాలని ఆశిస్తున్నారు. విద్యను వ్యాపార దృక్పథంతో కాకుండా సేవా భావంతో అందించి, మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఫీజుల నిర్ణయం తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు


