అంగన్‌వాడీలను ఈడ్చుకెళ్లారు
u పిన్నులతో గుచ్చి… మగ పోలీసుల అరాచకం
. నిద్రలో ఉండగా అక్రమ అరెస్టులు
. తెల్లవారు జామున ధర్నా చౌక్‌లో వీరంగం
. కాలకృత్యాలకు వెళ్లకుండా జీపుల్లో తిప్పిన వైనం
. 1000 మందికి పైగా అరెస్టు
. చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని హెచ్చరిక
. అరెస్టులపై రాష్ట్రవ్యాప్తంగా నిరసన దీక్షలు
. ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : కనీస వేతనాల అమలు కోసం ఉద్యమిస్తున్న అంగన్‌వాడీలపై ప్రభుత్వం దమనకాండకు పాల్పడింది. అంగన్‌వాడీలను, హెల్పర్లను పోలీసులు ఈడ్చుకెళ్లారు. విజయవాడ ధర్నా చౌక్ వేదికగా అంగన్‌వాడీలు చేపట్టిన శాంతియుత పోరాటంపై చంద్రబాబు సర్కారు పోలీసులతో అణచివేసే చర్యలకు పాల్పడి తీవ్ర విమర్శల పాలయింది. మంగళవారం తెల్లవారు జామున నిద్రలో ఉన్న అంగన్‌వాడీలను మగ పోలీసులతో తట్టి లేపించి, ఆ తర్వాత ఆడ పోలీసులను రంగంలోకి దించి ఈడ్చుకుంటూ వ్యాన్లలోను, కార్లలోను నెట్టిపారేశారు. కనీస వేతనం అమలు చేయాలని, సర్వీసు నిబంధనలు క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఐక్య కార్యాచరణ సమితి (ఏఐటీయూసీ, సీఐటీయూసీ, ఐఎఫ్‌టీయూ) చలో విజయవాడ పిలుపులో భాగంగా రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది ధర్నా చౌక్‌కు పోటెత్తారు. మహిళలు తమ బిడ్డలను, కుటుంబాలను వదిలి న్యాయమైన హక్కుల కోసం రోడ్డెక్కితే, ప్రభుత్వం వారిని నేరగాళ్లలా పరిగణించి అమానుషంగా వ్యవహరించింది. ఈ నెల 2 వ తేదీ సోమవారం ఉదయం నుంచి నిరంతరాయంగా సాగిన ఈ మహాధర్నా అర్థరాత్రి దాటిన తర్వాత కూడా కొనసాగుతుండటంతో పోలీసులు బరితెగించారు. ధర్నా చౌక్ ప్రాంగణంలో కరెంట్ కట్ చేసి వారికి అడుగడుగునా అసౌకర్యం కల్పించారు. నిద్రలో ఉన్న మహిళా కార్యకర్తలపై మంగళవారం తెల్లవారుజామున మెరుపుదాడికి దిగారు. కనీసం మానవత్వం, మహిళలన్న విచక్షణ లేకుండా పురుష పోలీసులు వారిని పిన్నులతో గుచ్చి లేపడం అత్యంత ఘోరమైన చర్య. గాఢ నిద్రలో ఉన్న వారిని బలవంతంగా ఈడ్చుకుంటూ వెళ్లి వ్యాన్లలోకి నెట్టేయడం, అడ్డుకున్న వారిపై విరుచుకుపడటం పోలీసుల అరాచకానికి పరాకాష్టగా నిలిచింది. ఒక వైపు అంగన్‌వాడీ నేతలతో చర్చలు సాగుతాయని చెబుతూనే, మరోవైపు ఉద్యమంలో ఉన్న అంగన్‌వాడీలపై పోలీసులతో చంద్రబాబు ప్రభుత్వం అణచివేత చర్యలకు పాల్పడటంపై తీవ్ర విమర్శలు రేగాయి. ఈ సమయంలో ధర్నా చౌక్ వద్ద పోలీసులు సృష్టించిన భీభత్సం వర్ణనాతీతం. మహిళలను నియంత్రించేందుకు మహిళా పోలీసుల కంటే పురుష పోలీసులే అధికంగా రంగంలోకి దిగడం విమర్శలకు తావిస్తోంది. అంగన్‌వాడీలను బలవంతంగా లాక్కెళ్లడం వంటి చర్యలు చూస్తుంటే ఇది ప్రజాస్వామ్యమా?, లేక నియంతృత్వమా? అనే సందేహం కలుగుతోంది. అరెస్టు సమయంలో అంగన్‌వాడీల కనీస వ్యక్తిగత వస్తువులను, బ్యాగులను, సెల్‌ఫోన్లనూ తీసుకోవడానికి అనుమతించలేదు. కనీసం కాలకృత్యాలు తీర్చుకోవడానికీ అవకాశం ఇవ్వకుండా వారిని పోలీసు జీపుల్లో ఉంచి గంటల తరబడి నగరం చుట్టూ తిప్ప్పుతూ మానసిక హింసకు గురిచేశారు. అంగన్‌వాడీ రాష్ట్ర నాయకులు బి.బేబిరాణి, కె.సుబ్బరావమ్మతో సహా ఆయా సంఘాలకు చెందిన సుమారు వెయ్యి మందిని అక్రమంగా అరెస్టు చేశారు. విజయవాడకు 100 కిలోమీటర్ల దూరంలోని నూజివీడు, ఏలూరు, పల్నాడు, సత్తెనపల్లి, బుట్టాయిగూడెం, చాట్రాయి వంటి మారుమూల ప్రాంతాలకు విడివిడిగా తరలించారు.
పోలీసులు… అంగన్‌వాడీలకు తీవ్ర వాగ్వాదం
ధర్నా చౌక్ ప్రాంగణంలో పోలీసులు, అంగన్‌వాడీలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ‘మేమేమైనా రౌడీలమా? దొంగలమా? మమ్మల్ని ఈ రకంగా ఎందుకు వేధిస్తున్నారు?’ అంటూ అంగన్‌వాడీ కార్యకర్తలు ఆవేదనతో ప్రశ్నించారు. చంద్రబాబుకు ఓట్లేసి గెలిపించినందుకు మాకు దక్కిన శిక్ష ఇదేనా అంటూ వారు కన్నీరుమున్నీరయ్యారు. ధర్నా చౌక్ చుట్టూ ఇనుప బారికేడ్లు, ముళ్ల కంచెలు వేసి ఒక యుద్ధ క్షేత్రంలా మార్చిన ప్రభుత్వం… అంగన్‌వాడీ ఉద్యమాన్ని అణచివేయడం దారుణమన్నారు. అణచివేత పెరిగేకొద్దీ ఉద్యమం మరింత ఉధృతమవుతుందని, ఎన్ని అరెస్టులు చేసినా తమ పోరాటం ఆగదని వారు హెచ్చరించారు. ఈ దమనకాండను పది వామపక్ష పార్టీలు, కేంద్ర కార్మిక సంఘాల ఐక్య వేదిక, ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండించాయి. కనీస వేతనాలు అడిగినందుకు మహిళలపై ఇటువంటి అమానుష చర్యలకు పాల్పడటం ప్రభుత్వ పతనానికి నాంది అని నేతలు హెచ్చరించారు. అరెస్టు చేసిన వారందరినీ వెంటనే బేషరతుగా విడుదల చేయాలని, అంగన్‌వాడీల డిమాండ్లపై తక్షణమే చర్చలు జరపాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ అరాచకాలను ఎండగడుతూ అంగన్‌వాడీలు చేస్తున్న ఈ పోరాటం ఇప్ప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
తక్షణమే ప్రభుత్వం చర్చలకు పిలవాలి : ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్
అంగన్‌వాడీల కోసం 20 నెలలుగా ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదని, తమను చంద్రబాబు ప్రభుత్వం చర్చలకు పిలిచి, సత్వరమే వేతనాలు పెంచకపోతే రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్‌టీయూ) నేతలు హెచ్చరించారు. విజయవాడ ప్రెస్ క్లబ్ ఆవరణలో యూనియన్ రాష్ట్ర నాయకులు లలితమ్మ, ýక్ష్మీదేవి, సుజాత, దుర్గారాణి, శిరీష, లక్ష్మీదేవి విలేకరులతో మాట్లాడారు. అక్రమ అరెస్టులను ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా, మండల కేంద్రాల్లో నిరసనలకు పిలుపునిచ్చామ న్నారు. తెల్లవారు ఝామున ధర్నాచౌక్ ప్రాంగణంలో అంగన్‌వాడీలు నిద్రిస్తున్న సమయంలో పోలీసులు పెద్దఎత్తున శిబిరాన్ని చుట్టుముట్టి నాయకులను, కార్యకర్తలను ఈడ్చుకుంటూ అరెస్టు చేశారని, ఇది చాలా దుర్మార్గమైన చర్యని మండిపడ్డారు. అరెస్టు చేసిన వారిని రాష్ట్రంలోని వివిధ జిల్లాలోని పోలీస్ స్టేషన్లకు తరలించారని, వారిని సత్వరమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.


