Monday, March 16, 2026
Home‘స్థానికత’ చిక్కులు!

‘స్థానికత’ చిక్కులు!

- Advertisement -

. ఇంజినీరింగ్‌ సీట్లకు బ్రేక్‌
. హైకోర్టు పరిధిలో సమస్య
. హడావుడీ ఉత్తర్వులే కారణం
. యూజీ ప్రవేశాలపై విద్యార్థుల ఆందోళన

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: రాష్ట్రంలో విద్యా ప్రవేశాల్లో స్థానికత వివాదం విద్యార్థుల భవిష్యత్‌కు ఆటంకంగా మారింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఏపీఈఏపీసెట్‌2025 చివరి విడత కౌన్సెలింగ్‌ వాయిదా పడిరది. ఈ పరిణామాలు విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. అనుకున్న షెడ్యూలు ప్రకారం ఈ నెల 4న సీట్లను ఖరారు చేయవలసి ఉండగా… రాష్ట్ర హైకోర్టు తీర్పుతో నిలిచిపోయింది. తొలి విడత కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన వారిలో కొందరు ఆయా కళాశాలల్లో స్వయం నివేదిక సమర్పించి, ఆ తర్వాత మెరుగైన కళాశాలలు, బ్రాంచీలు కోరుతూ రెండో విడత వెబ్‌ కౌన్సెలింగ్‌లో నమోదు చేసుకున్నారు. ఇప్పుడు వాయిదా పడిన సీట్ల ప్రక్రియ ఎప్పటికి వస్తుందో? అన్న సందేహాలు వారిలో వ్యక్తమవుతున్నాయి. ఉన్నత విద్యామండలి ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 4 నుంచి తరగతులు ప్రారంభించాల్సి ఉంది. ఇంకా సీట్ల ప్రక్రియనే వెల్లడిరచకపోవడంతో తరగతుల ప్రారంభం మరింత ఆలస్యమయ్యే పరిస్థితులున్నాయి. రాష్ట్రంలో పదో తరగతి చదివి, హైదరాబాద్‌లో ఇంటర్మీడియట్‌ అభ్యసించిన ముగ్గురు విద్యార్థులు ఏపీఈఏపీసెట్‌ 2025కు దరఖాస్తు చేశారు. ఏపీలో ఆ విద్యార్థులు ఇంటర్‌ చదవకపోవడంతో వారిని స్థానిక స్థితి కేటగిరి కింద డీటీఈ పరిగణించలేదు. దానిని సవాల్‌ చేస్తూ విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. అనంతరం వారికి స్థానికత కింద సీట్లు కేటాయించాలని హైకోర్టు ఆదేశించించింది. అదే జరిగితే మొత్తం సీట్ల కేటాయింపులో మార్పులు, చేర్పులతో మరిన్ని సమస్యలు ఎదురవుతాయని అధికారులు భావించి, తిరిగి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాల మేరకు తుది విడత ఇంజినీరింగ్‌ సీట్ల భర్తీ ప్రక్రియ ఉంటుంది.
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో స్థానికత ఇలా…
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌గా ఉన్నప్పుడు ఆర్టికల్‌ 371`డి రాష్ట్రపతి ఉత్తర్వుల ఆధారంగా స్థానికత ఉండేది. అప్పట్లో దాని ప్రకారం 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు చదివిన వారికి స్థానికతగా గుర్తించేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఓయూ, ఏయూ, ఎస్వీయూగా మూడు రీజియన్లుగా ఉండేవి. ఓయూ పరిధిలో తెలంగాణ జిల్లాలు, ఏయూలో శ్రీకాకుళం నుంచి ఒంగోలు వరకు, ఎస్వీయూ నెల్లూరుతో పాటు రాయలసీమ జిల్లాలను విభజించారు. ఆయా రీజియన్లలో విద్యార్థులు 6 నుంచి 12వ తరగతి వరకు ఎక్కువ కాలం అక్కడ చదివితే… ఆ ప్రాంతాన్ని స్థానికతగా గుర్తించేశారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావంతో ఓయూ రీజియన్‌ జిల్లాలు పూర్తిగా తెలంగాణకు వెళ్లిపోయాయి. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు కావడంతో ఏపీ ప్రభుత్వం ఏయూ, ఎస్వీయూలో తెలంగాణ వారిని స్థానికేతరులుగా నిర్ధారిస్తూ, వారికి ఎక్కడా సీట్లు ఇచ్చే అవకాశం లేదనీ హడావుడీగా ఈ ఏడాది మే 20న ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీజేసింది. దీనిపై ఆరంభం నుంచి అనేక అభ్యంతరాలు వ్యక్తమైనప్పటికీ, ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించకపోవడంతో సమస్యలు తలెత్తాయి.
తెలంగాణ తరహా జీవోతోనే సమస్యలు
బి.టెక్‌, ఎంబీబీఎస్‌ తదితర అండర్‌ గ్రాడ్యుయేషన్‌ (యూజీ) కోర్సుల్లో ప్రవేశాలకుగాను… సదరు విద్యార్థి 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు నాలుగేళ్లల్లో కనీసం ఒక ఏడాది సంబంధిత రీజియన్‌లో కాకుండా బయట చదివితే… వారిని స్థానికేతరులుగా జీవో సారాంశం ఉంది. ముందు ఈ తరహా ఉత్తర్వులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాగా… దానిని వ్యతిరేకిస్తూ ఆ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు హైదరాబాద్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. అదే బాటలో ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు తేవడంతో ప్రవేశాలకు ఆటంకాలు ఎదురయ్యాయి. దీనిపై సుప్రీం కోర్టును విద్యార్థులు ఆశ్రయించారు. స్థానికతపై రాష్ట్ర ప్రభుత్వాలే సరైన నిర్ణయం తీసుకోవాలని, ఒక ఏడాది బయట చదివిన వారికి స్థానికత వర్తించబోదనే ఉత్తర్వులు ఇవ్వడం సరికాదంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీం ఆదేశించింది. అంత తతంగం తెలంగాణలో జరుగుతున్నప్పటికీ, ఏ మాత్రం ఏపీ ప్రభుత్వం గమనించకుండా అదే తరహాగా హడావుడీగా జీవో ఇవ్వడంతో విద్యార్థుల ప్రవేశాలకు సమస్యలు తలెత్తాయి. ఫలితంగా ఇంజినీరింగ్‌ రెండో విడత కౌన్సెలింగ్‌ సీట్ల ఖరారు ప్రక్రియ నిలిచిపోయింది. ఏపీ హైకోర్టు ఎలాంటి ఆదేశాలిస్తుందనేదీ చూడాలి. అసలే జాప్యంతో మొదలైన కౌన్సెలింగ్‌కు మరింత అడ్డంకులు రావడంతో విద్యార్థులకు దిక్కు తోచడం లేదు. దీనికి మొత్తం ఉన్నత విద్యామండలి, సాంకేతిక విద్యాశాఖ అధికారులే బాధ్యత వహించాలి.
వారి నిర్లక్ష్యం, ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడం వెరసి విద్యార్థుల ప్రవేశాలకు ఆటంకమైంది. ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం తక్షణమే స్పందించి స్థానికత అంశంపై చొరవ చూపి… విద్యార్థుల ప్రవేశాలకు సాంకేతిక సమస్యలు ఎదురవ్వకుండా చర్యలకు ఉపక్రమించాలి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు