Homeజాతీయంసుభాష్ చంద్రకు భారీ ఊరట..

సుభాష్ చంద్రకు భారీ ఊరట..

- Advertisement -

రూ.22,006 కోట్ల బకాయిలకు రూ.6.5 కోట్ల చెల్లింపు..
జీ గ్రూప్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్రకు సంబంధించిన రుణ పరిష్కార ప్రణాళికకు నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (NCLT) ఆమోదం తెలిపింది.
ఈ ప్రణాళిక ప్రకారం రుణదాతలకు మొత్తం రూ.22,006.57 కోట్ల క్లెయిమ్‌లకు గాను కేవలం రూ.6.5 కోట్లు మాత్రమే అందనున్నాయి.
అంటే రుణదాతలకు దక్కే మొత్తం వారి క్లెయిమ్‌లలో కేవలం 0.03 శాతం మాత్రమే.దాదాపు 99.97 శాతం హేర్‌కట్ (బకాయిల్లో రుణదాతలు వదులుకోవాల్సిన మొత్తం) పడింది.సుభాష్ చంద్ర రుణ చెల్లింపు ప్రణాళికపై NCLTలోని ఇద్దరు సభ్యుల బెంచ్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో.. మూడో సభ్యుడిగా నియమితులైన జ్యుడీషియల్ మెంబర్ నీలేశ్ శర్మ ఈ నిర్ణయం తీసుకున్నారు.

రూ.6.25 కోట్లను రుణదాతలకు పంపిణీ..
ప్రణాళిక ప్రకారం రూ.6.25 కోట్లను రుణదాతలకు పంపిణీ చేయనున్నారు.మరో రూ.25 లక్షలను దివాలా ప్రక్రియకు సంబంధించిన ఖర్చుల కోసం కేటాయించారు.రుణదాతల్లో 80.81 శాతం ఓటింగ్ వాటా కలిగినవారు ఈ ప్రణాళికకు మద్దతు తెలిపారు.అయితే ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ సహా పలువురు రుణదాతలు ఈ ప్రతిపాదనను వ్యతిరేకించారు.ఇంత తక్కువ మొత్తంలో రికవరీకి ఆమోదం తెలపడం సమంజసం కాదని వారు వాదించారు.ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌కు రూ.1,322.39 కోట్ల క్లెయిమ్ ఉండగా.. ఈ ప్రణాళిక ప్రకారం కేవలం రూ.38.09 లక్షలు మాత్రమే అందనున్నాయి.అంటే దాని మొత్తం బకాయిలో సుమారు 0.028 శాతం మాత్రమే రికవరీ అవుతుంది.

ఆమోదించిన రుణ చెల్లింపు ప్రణాళిక అన్ని రుణదాతలకు వర్తింపు..
అయితే అవసరమైన మెజారిటీ రుణదాతలు తీసుకున్న వాణిజ్య నిర్ణయాన్ని తాము స్వయంగా మార్చలేమని ట్రైబ్యునల్ స్పష్టం చేసింది.సుభాష్ చంద్ర వ్యక్తిగత ఆస్తుల విలువను పరిశీలించినప్పుడు.. ఈ ప్రణాళికను తిరస్కరిస్తే వ్యతిరేకించిన రుణదాతలకు మరింత మెరుగైన రికవరీ లభించే అవకాశం తక్కువగా ఉందని పేర్కొంది.ఆమోదించిన రుణ చెల్లింపు ప్రణాళిక అన్ని రుణదాతలకు వర్తిస్తుందని NCLT తెలిపింది.దీనికి వ్యతిరేకంగా ఓటు వేసిన రుణదాతలు కూడా దీనికి కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేసింది.దివాలా, బకాయిల పరిష్కార కోడ్ (IBC)లోని సెక్షన్ 115 ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

రూ.14,100 కోట్లు రికవరీ..
సుభాష్ చంద్ర కేసులో ఇంత భారీ హేర్‌కట్ రావడంపై వ్యాపారవేత్త విజయ్ మాల్యా స్పందించారు.భారతదేశంలో రుణాల పరిష్కార ప్రక్రియలో ఉన్న అసమానతలను ఈ వ్యవహారం చూపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.ఎక్స్‌లో చేసిన పోస్టులో మాల్యా.. సుభాష్ చంద్ర రూ.22,006 కోట్లకు పైగా ఉన్న క్లెయిమ్‌లపై కేవలం రూ.6.5 కోట్లతో సెటిల్‌మెంట్ పొందడాన్ని ప్రస్తావించారు.తన విషయంలో మాత్రం రూ.6,203 కోట్ల జడ్జ్‌మెంట్ డెట్‌కు గాను బ్యాంకులు, ప్రభుత్వం కలిసి తన నుంచి రూ.14,100 కోట్లు రికవరీ చేసినట్లు పేర్కొన్నాయని ఆయన అన్నారు.ఈ రెండు కేసులను పోల్చిన మాల్యా.. భారత రుణ పరిష్కార వ్యవస్థలో రుణగ్రహీతల పట్ల ఒకే విధమైన ప్రమాణాలు పాటిస్తున్నారా? అని ప్రశ్నించారు.

దివాలా చట్టంలో సవాల్..
తన ఆస్తుల నుంచి జరిగిన రికవరీలకు సంబంధించి ప్రభుత్వం, బ్యాంకులు చెబుతున్న లెక్కలను మాల్యా గతంలో కూడా ప్రశ్నించారు.ఆ మొత్తాలను ఎలా లెక్కించారనే దానిపై మరింత స్పష్టత కావాలని కోరారు. సుభాష్ చంద్ర కేసు భారతదేశ దివాలా వ్యవస్థ ఎదుర్కొంటున్న కీలక సవాలును మరోసారి ముందుకు తెచ్చింది.ఒకవైపు రుణదాతలకు సాధ్యమైనంత ఎక్కువ మొత్తాన్ని రికవరీ చేయించాలి.మరోవైపు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తికి, రుణదాతలకు మెరుగైన ఫలితం లభించే అవకాశం ఉన్నప్పుడు, ఆమోదించిన రుణ పరిష్కార ప్రణాళిక ద్వారా దివాలా నుంచి బయటపడే అవకాశం కల్పించాలి.ఈ రెండు అంశాల మధ్య సమతుల్యత సాధించడమే ఈ వ్యవస్థకు ప్రధాన సవాలుగా మారింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు