Homeక్రీడలుఫలితం నీదా…నాదా!

ఫలితం నీదా…నాదా!

- Advertisement -

ఐపీఎల్`19 తుదిపోరుకు వేళాయే
నేడు
టైటిల్ పోరులో తలపడనున్న బెంగళూరు, గుజరాత్
అహ్మదాబాద్‌లో రాత్రి 7.30 నుంచి మ్యాచ్ ప్రారంభం
అహ్మదాబాద్:
టోర్నీలో ఉత్తమ ప్రదర్శన చేసిన రెండు మేటి జట్లు అంతిమ సమరానికి సిద్ధమయ్యాయి.
లీగ్ దశలో సమాన విజయాలతో టాప్-2లో నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ మధ్య ఐపీఎల్ 19వ సీజన్ టైటిల్ పోరుకు రంగం సిద్ధమైంది. తొలిసారిగా గతేడాది ఐపీఎల్ ట్రోఫీ కల నెరవేర్చుకున్న ఆర్సీబీ, వరుసగా రెండో టైటిల్‌ను అందుకోవాలని ఉవ్విళ్లూరుతుంటే…ఐపీఎల్‌లో అడుగు పెట్టిన తొలి ఏడాదే ఛాంపియన్ కావడమే కాక అయిదేళ్లలో మూడో ఫైనల్ ఆడబోతున్న జీటీ కూడా ఈ రెండో కప్ప్పుపై కన్నేసింది. ఆదివారం (నేడు) సమవుజ్జీల పోరులా కనిపిస్తున్న ఫైనల్లో అ‘ద్వితీయ’ విజయాన్నందుకునే జట్టేదో? ఈ ఉత్కంఠ పోరుకు అహ్మదాబాద్ నరేంద్ర మోదీ అంతర్జాతీయ స్టేడంయం వైదికైంది. రాత్రి 7.30 గంటలకు ప్రారంభమయ్యే తుదిపోరులో ఎవరిని విజయం వరిస్తుందో చూడాలి.
రెండు నెలల పాటు అభిమానులను ఉర్రూతలూగించిన లీగ్‌లో ఆఖరి పోరు చూడడానికి క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అత్యుత్తమ జట్ల మధ్య ఆసక్తికర పోరు…
టోర్నీలో అత్యుత్తమ జట్ల మధ్యే ఫైనల్ జరుగుతుండడం…ఆల్‌రౌండ్ బలంతో సమవుజ్జీల్లా కనిపిస్తున్న జట్లలో ఎవరు విజేతగా నిలుస్తారో చెప్పలేని పరిస్థితి ఉండడం ఈ పోరుపై ఆసక్తిని పెంచుతోంది. ఇరు జట్లూ ఈ రెండో కప్ప్పు మీదే గురి పెట్టాయి. తన సొంతగడ్డ అహ్మదాబాద్‌లో ఆడబోతుండడం గుజరాత్‌కు సానుకూలాంశం కాగా…క్వాలిఫయర్-1లో ఇదే ప్రత్యర్థిని చిత్తుగా ఓడించడం బెంగళూరు ఆత్మవిశ్వాసాన్ని పెంచేదే.
జీటీలో ఆ ముగ్గురు కీలకం…
మిడిల్ ఆర్డర్ కొంత బలహీనంగా ఉన్నప్ప్పుటికీ…జీటీ ఇంత నిలకడగా ఆడి, ఫైనల్‌కు వచ్చిందంటే అందుకు ప్రధాన కారణం టాప్-3 బ్యాటర్లు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్‌లతో కూడిన ఓపెనింగ్ జోడీ గుజరాత్‌కు అతి పెద్ద బలం. క్వాలిఫయర్-2లో బ్యాటింగ్‌కు కాస్త కష్టంగా ఉన్న పిచ్‌పై 215 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేసిందంటే అందుకు గిల్, సుదర్శన్ వేసిన తిరుగులేని పునాదే కారణం. ఈ జోడీ ఏకంగా 167 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. గిల్ సెంచరీ కొడితే, సుదర్శన్ అర్ధశతకం సాధించాడు. లీగ్ దశలో కూడా ఈ జోడీ అనేక మ్యాచ్‌ల్లో జట్టుకు అద్భుత ఆరంభాలందించింది. మూడో నంబర్లో ఆడే బట్లర్ సైతం 500 పైచిలుకు పరుగులు సాధించాడు. కొన్ని మ్యాచ్‌ల్లో అతను కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. జీటీ బ్యాటింగ్ భారాన్ని చాలా వరకు ఈ ముగ్గురే మోస్తున్నారు. నిశాంత్ సింధు, తెవాతియా, హోల్డర్‌లపై పెద్దగా అంచనాలు లేవు. జీటీ టాప్-3 బ్యాటర్లు విఫలమైతే…మిగతా బ్యాటింగ్ ఆర్డర్ ఏమేర జట్టును నిలబెడుతుందన్నది ప్రశ్నార్థకం. ఇక బౌలింగ్ విషయానికి వస్తే…గుజరాత్ టైటాన్స్‌కు పేస్‌లో తిరుగులేదు. టోర్నీలో నంబర్‌వన్ బౌలర్‌గా కొనసాగుతున్న కాగిసో రబాడకు తోడు మహ్మద్ సిరాజ్ (18 వికెట్లు), జేసన్ హోల్డర్ (17)లతో గుజరాత్ పేస్ దళం ఎంతో బలంగా కనిపిస్తోంది. రషీద్ ఖాన్ రూపంలో నాణ్యమైన స్పిన్నర్ ఆ జట్టుకు అందుబాటులో ఉన్నాడు.
బ్యాటింగే బెంగళూరికి బలం…
బెంగళూరు గత ఏడాది ఛాంపియన్ అయిందన్నా, ఈసారి ఆధిపత్యం చలాయిస్తూ ఫైనల్ చేరిందన్నా…అందుకు ప్రధాన కారణం పటిష్టమైన బ్యాటింగ్ లైనప్. ఒకరు పోతే ఇంకొకరు అన్నట్లుగా చాలామంది మ్యాచ్ విన్నర్లుండడం…ఆరంభం నుంచి చివరి వరకు విధ్వంసం కొనసాగించే ఆటగాళ్లతో బ్యాటింగ్ ఆర్డర్ నిండి ఉండడంతో ఆ జట్టుకు తిరుగులేకుండా పోతోంది. ఆ జట్టులో కాస్త ఆచితూచి ఆడేది కోహ్లి మాత్రమే. నిలకడగా రాణిస్తూ చెలరేగి ఆడుతున్నాడు. ఫిల్‌సాల్ట్ రూపంలో ఆ జట్టుకు విధ్వంసక ఓపెనర్ అందుబాటులో ఉన్నాడు. అతను గాయపడ్డాక ఆర్సీబీ కాస్త ఇబ్బంది పడ్డప్పటికీ… ఆఖర్లో వెంకటేశ్ అయ్యర్ రూపంలో దూకుడైన బ్యాటర్ కలిసి వచ్చాడు. మూడో స్థానంలో ఆడే దేవ్‌దత్ పడిక్కల్ చెలరేగి ఆడుతున్నాడు. ఇక కెప్టెన్ రజత్ పాటీదార్ ప్రశాంతంగా కనిపిస్తూనే ప్రత్యర్థి బౌలింగ్‌ను ఊచకోత కోస్తాడు. ఇంకా టిమ్ డేవిడ్, జితేశ్ శర్మ, కృనాల్ పాండ్య, రొమారియో షెపర్డ్‌ల రూపంలో ఇన్నింగ్స్‌కు మెరుపు ముగింపునివ్వగల బ్యాటర్లు ఆర్సీబీకి ఉన్నారు. ఎక్కువమంది హిట్టర్లు ఉండడం వల్ల ఆ జట్టు స్కోరు వేగం ఏ దశలోనూ తగ్గదు. లక్ష్యాలు పెద్దవైనా ఆ జట్టు తొణకదు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే…పేసర్ భువనేశ్వర్ ఈ సీజన్లో నిలకడగా రాణిస్తున్నాడు. అద్భుతమైన స్వింగ్‌తో మేటి బ్యాటర్లను కంగారెత్తిస్తూ వికెట్లు తీశాడు. రసిఖ్ (16 వికెట్లు) రూపంలో మరో ఆణిముత్యం లాంటి పేసర్ ఆర్సీబీకి దొరికాడు. స్పిన్‌లో ఆర్సీబీ కాస్త బలహీనం. స్పిన్‌ను పేస్‌లా వేసే కృనాల్ (13)కు తోడు సుయాశ్ ఆ జట్టుకు అందుబాటులో ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు