సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసు (SRUSHTI TEST TUBE BABY CENTER CASE ) లో తాజాగా ఇవాళ (శనివారం) ముగ్గురు అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన వారిలో మహిళలు కూడా ఉన్నారు. ఇప్పటివరకు అరెస్టైన నిందితుల సంఖ్య 11కు చేరింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో డాక్టర్ నమ్రతకు మహిళలే ఏజెంట్లుగా ఉన్నారని హైదరాబాద్ పోలీసులు తెలిపారు. శిశువుల క్రయ విక్రయాల్లో నమ్రతకు ఏజెంట్లు సహకరించారని చెప్పారు. ఏజెంట్లకు డాక్టర్ నమ్రత భారీగా నజరానాలు ఇచ్చారని హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు. ఇవాళ (శనివారం) ఈ కేసుకు సంబంధించిన కీలక విషయాలను మీడియాకు హైదరాబాద్ పోలీసులు తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా మరో నాలుగు రాష్ట్రాల్లో నమ్రతకు భారీ నెట్‌వర్క్ ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆయా రాష్ట్రాల్లో కూడా మహిళలే నమ్రతాకు ఏజెంట్లు ఉన్నారని వివరించారు.సరోగసి కోసం దంపతుల నుంచి రూ. 30 నుంచి రూ. 50 లక్షలు వసూలు చేశారని వెల్లడించారు. పిల్లలను కొనుగోలు చేసి సరోగసి ద్వారా పుట్టారంటూ దంపతులకు అప్పగించి డాక్టర్ నమ్రత మోసం చేశారని పోలీసులు తెలిపారు.
మరోవైపు… సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో సంచలన నిజాలు వెలుగు చూస్తున్నాయి. డాక్టర్ నమ్రతా కస్టడీ విచారణలో అక్రమాలు బయటపడుతున్నాయి. సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ పేరుతో గ్రామీణ ప్రాంతాల్లో మెడికల్ క్యాంపుల నిర్వహించినట్లు దర్యాప్తులో తేలింది. పేదింటి ఆడబిడ్డలకు ఉచితంగా ఫెర్టిలిటీ సేవలు చేస్తానని క్యాంపుల నిర్వహించినట్లు అధికారులు గుర్తించారు. ఏపీలోని పలు జిల్లాల్లో గ్రామీణ ప్రాంతాలు టార్గెట్‌గా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు విచారణలో తేలింది. మెడికల్ క్యాంపులు నిర్వహించి పేద మహిళలను డాక్టర్ నమ్రత గుర్తించినట్లు అధికారులు తెలిపారు.పేద మహిళల ఆర్థిక అవసరాలను గుర్తించి ఏజెంట్స్ ట్రాప్‌లో పెడుతున్నారు.
అక్రమంగా సంపాదించిన డబ్బులతో హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఫామ్‌హౌస్, భవన సముదాయాలు కొనుగోలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. మియాపూర్, కూకటపల్లి, సికింద్రాబాద్, యూసఫ్‌గూడతో పాటు చాలా ప్రాంతాల్లో భవన సముదాయాలు ఉన్నాయి. సృష్టి సెంటర్ కేసులో A3కల్యాణి, A6 సంతోషిల విచారణ కీలకంగా మారనుంది. ఏఎన్ఎం, ఆశా వర్కర్లు ఏజెంట్స్ ద్వారా చైల్డ్ ట్రాఫికింగ్‌కి డాక్టర్ నమ్రత పాల్పడ్డారు. కల్యాణి, సంతోషిలే దగ్గరుండి నవజాత శిశువులను తీసుకు రావడంలో కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల విచారణలో డాక్టర్ నమ్రత అక్రమాలు బయటపడుతున్నాయి. ఈ విచారణలో డాక్టర్ నమ్రత ఇంతవరు నోరు మెదపలేదు. నమ్రతా బాటలోనే A3 కల్యాణి, A6 సంతోషిలు ఉన్నారని హైదరాబాద్ పోలీసులు తెలిపారు.


