46,85,838 మంది రైతులకు లబ్ధి
. రూ.2,342 కోట్ల నిధుల కేటాయింపు
. మొదటివిడతలో ఒక్కో రైతుకు రూ.5 వేలు
. కేంద్రం ఇచ్చే రూ.2 వేలతో కలిపి రూ.7 వేలు జమ
. ప్రకాశం జిల్లా దర్శిలో ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల అమలులో భాగంగా ‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని ఆగస్ట్ 2న అమలు చేయాలని నిర్ణయించింది. ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో ఈ పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. దీంతో రాష్ట్రంలోని 46,85,838 మంది రైతులు లబ్ది పొందుతారు. మొదటి విడతలో రాష్ట్ర వాటాగా ఒక్కో రైతుకు రూ.5,000 చొప్పున మొత్తం రూ.2,342.92 కోట్ల నిధులను వారి ఖాతాలో ప్రభుత్వం నేరుగా జమ చేయనుంది. ఒక్కో రైతు కుటుంబానికి కేంద్ర సాయంతో కలిపి ఏడాదికి రూ.20 వేల చొప్పున అందిస్తామన్న హామీని ‘అన్నదాత సుఖీభవ’, ‘పీఎం కిసాన్’ అమలుతో నెరవేర్చినట్టయింది. ఏడాదికి కేంద్రం ఇచ్చే రూ.6 వేల సాయంతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.14 వేలు ఇవ్వనుంది. రెండు విడతలుగా రూ.5 వేల చొప్పున, మూడో విడత రూ.4 వేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. రూ.14 వేలను మూడు విడతలుగా అందించాలని గతంలోనే నిర్ణయించారు.
రైతుకు సాయం బాధ్యత: చంద్రబాబు
‘అన్నదాత సుఖీభవ’ అమలు సన్నద్ధతపై గురువారం సచివాలయంలో ఆర్థిక, రెవెన్యూ, జలవనరులు, వ్యవసాయ శాఖల ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షలో పాల్గొన్న జిల్లా కలెక్టర్లకు పథకం అమలుపై ఆదేశాలు జారీ చేశారు. అర్హులైన ప్రతి రైతుకూ అన్నదాత సుఖీభవ అందాలని, రైతులకు చేయూతనివ్వడం భారం కాదు… బాధ్యతగా గుర్తు పెట్టుకోవాలని సీఎం సూచించారు. రైతులకు నిధులే కాదు… నీళ్లూ ఇస్తున్నామని చెప్పారు. ఆగస్ట్ 2న ‘అన్నదాత సుఖీభవ’ పథకం అమలు కార్యక్రమం పండుగ వాతావరణంలో జరగాలని, గ్రామ సచివాలయం నుంచి పంచాయతీలు, మండల కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల స్థాయిలో ఈ కార్యక్రమం నిర్వహించాలని అధికారులకు సూచించారు.
వ్యవసాయ ఎగుమతులపై అమెరికా సుంకాల ప్రభావం
‘ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని చంద్రబాబు చెప్పారు. బొప్పాయి ధర తగ్గిందని కథనాలు వస్తున్నాయి. వాటిపైనా సమీక్ష చేసి రైతులకు న్యాయం చేయాలి. ఎరువుల విషయంలో కలెక్టర్లు బాధ్యతగా వ్యవహరించాలి. ఎక్కడా కొరత రానీయొద్దు. శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద కొనసాగుతోంది. గండికోట, బ్రహ్మంసాగర్, సోమశిల, కండలేరు ప్రాజెక్టులను వందశాతం నీటితో నింపాలి. రిజర్వాయర్లలో ఎంత నీరు ఉందనే సమాచారం ఉండాలి. నీటి నిర్వహణను పకడ్బందీగా అమలు చేయాలి. భారత్‌పై అమెరికా 25 శాతం సుంకాలు విధించింది. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొనాలని సీఎం స్పష్టం చేశారు. సీఎస్ కె.విజయానంద్, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్, సీసీఎల్‌ఏ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయలక్ష్మి, సీఎం ముఖ్యకార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పీయూశ్ కుమార్, సీఎం కార్యదర్శి రాజమౌళి, వ్యవసాయశాఖ డైరెక్టర్ డిల్లీరావు, జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.


