తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని, చర్చల ద్వారా వాటిని పరిష్కరించుకుందామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. సమ్మె ఆలోచన విరమించుకోవాలని ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలకు సూచించారు. హైదరాబాద్‌లో పలువురు ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి తమ ఇబ్బందులను, డిమాండ్లను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల సమస్యలను వినడానికి ముఖ్యమంత్రితో పాటు తాను ఎప్పుడూ అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు. సంస్థ పరిరక్షణ, కార్మికుల సంక్షేమం, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే తమ ప్రభుత్వ ప్రాధాన్యతలని పునరుద్ఘాటించారు. ఆర్టీసీ క్రమంగా నష్టాల నుంచి గట్టెక్కుతోందని, సమస్యలు కూడా తగ్గుముఖం పడుతున్నాయని మంత్రి వివరించారు. ఇలాంటి కీలక సమయంలో సిబ్బంది సమ్మెకు దిగితే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని, సంస్థపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆయన అన్నారు.
గత పదేళ్ల పాలనలో మునుపటి ప్రభుత్వం ఆర్టీసీని పూర్తిగా నిర్వీర్యం చేసిందని పొన్నం విమర్శించారు. ఆ కాలంలో ఒక్క కొత్త బస్సు కొనలేదని, ఒక్క కొత్త ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. అంతేకాకుండా, ఉద్యోగులకు చెందిన సీసీఎస్, పీఎఫ్ నిధులను కూడా అప్పటి ప్రభుత్వం వాడుకుందని ఆయన తెలిపారు. తమ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్టీసీ ఉద్యోగులకు బాండ్ రూపంలో రూ.400 కోట్లు, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పీఎఫ్ బకాయిలు రూ.1,039 కోట్లు, సీసీఎస్ బకాయిలు రూ.345 కోట్లు చెల్లించామని మంత్రి గుర్తు చేశారు. వీటితో పాటు 1,500 మందికి కారుణ్య నియామకాలు పూర్తి చేశామని, కొత్తగా మరో 3,038 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చామని కార్మిక సంఘాల నేతలకు వివరించారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, సహకరించాలని ఆయన కోరారు.