అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాకు మరోమారు వార్నింగ్ ఇచ్చారు. అమెరికాపై విధించిన 34 శాతం ప్రతీకార సుంకాలను వెంటనే రద్దు చేయాలని చెప్పారు. 24 గంటల్లో ప్రతీకార సుంకాలను రద్దు చేయకుంటే చైనాపై అదనంగా 50 శాతం టారిఫ్స్ విధిస్తామని హెచ్చరించారు. ఈ నిర్ణయం ఈ నెల 9 నుంచి అమలులోకి వస్తుందని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ ఫాం ాట్రూత్ సోషల్్ణ లో ఓ పోస్టు పెట్టారు.
ప్రపంచ దేశాలన్నీ అమెరికాపై పెద్దమొత్తంలో పన్నులు విధిస్తున్నాయని ఆరోపిస్తూ ట్రంప్ ఇటీవల విదేశాలపై టారిఫ్ లు విధించారు. ఇందులో భాగంగానే చైనాపైనా 34 శాతం పన్నులు విధిస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై చైనా తీవ్రంగా స్పందిస్తూ అమెరికాపైనా అంతే మొత్తంలో (34 శాతం) ప్రతీకార సుంకాలను విధించింది. ఈ నెల 10 నుంచి ఈ టారిఫ్ లు అమలు చేయనున్నట్లు తెలిపింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ప్రతీకార సుంకాలను విధించాలన్న నిర్ణయం నుంచి వెనక్కి తగ్గాలని చైనాను హెచ్చరించారు.