గత నెలలో అనారోగ్యానికి గురైన జ్యోతి
మంగళగిరి ఎయిమ్స్‌లో చికిత్స
బర్డ్ ఫ్లూ లక్షణాలతో గత వారం మృతి
నిర్ధారించిన పూణెలోని వైరాలజీ ల్యాబ్
ఆంధ్రప్రదేశ్‌లో బర్డ్‌ఫ్లూ (ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా/హెచ్5ఎన్1) బారినపడి రెండేళ్ల చిన్నారి మృతి చెందడం కలకలం రేపుతోంది. గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని బాలయ్యనగర్‌కు చెందిన పెండ్యాల జ్యోతి (2) బర్డ్‌ఫ్లూతో ప్రాణాలు కోల్పోయినట్టు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులు నిన్న ధ్రువీకరించారు. జ్యోతి గత నెలలో అనారోగ్యానికి గురైంది. కుటుంబ సభ్యులు ఆమెను మంగళగిరిలోని ఎయిమ్స్‌లో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ వారం రోజుల క్రితం మృతి చెందింది. అయితే, ఆమెలో బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించడంతో అనుమానించిన వైద్యులు నమూనాలను పూణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపారు. తాజాగా, ఈ పరీక్షలకు సంబంధించిన నివేదిక ఆసుపత్రికి అందింది. పరీక్షల్లో జ్యోతికి బర్డ్ ఫ్లూ సోకినట్టు నిర్ధారణ అయినట్టు వైద్యాధికారులు తెలిపారు.