11 నుంచి 25వరకు అటల్ బిహారి వాజ్ పేయి శత జయంతి సుపరిపాలన దినోత్సవాలు
విశాలాంధ్ర – రాజమండ్రి సిటి : ఈనెల 25 వ తేదీన అటల్ సుపరిపాలన దినోత్సవంగా కేంద్రం ప్రకటించిందని, ఈక్రమంలో ఈనెల 11 తేదీ నుండి 25 తేదీ వరకు అటల్ బిహారీ వాజపేయి శతజయంతి సుపరిపాలన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి చెప్పారు. మంగళవారం ఉదయం స్థానిక జిల్లా బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మాజీ ప్రధాన మంత్రి వాజ్ పేయి అజాత శత్రువని, 25 పార్టీలతో అలయన్స్ ప్రభుత్వాన్ని సమర్ధవంతంగా నడిపారన్నారు. తన పదవీ కాలంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. పనికి ఆహార పథకం, సర్వశిక్ష అభయాన్ లాంటి అనేక సంస్కరణలు ఆయన తీసుకువచ్చారని, శాంతి దూతగా, ధైర్యం ఉన్న నాయకుడిగా బిన్న నాయకత్వం ఉన్న వ్యక్తిగా అటల్ బిహారీ వాజ్ పేయి పేరుగడించారన్నారు. సుపరిపాలన ప్రారంభించింది కూడా అటల్ బిహారీ వాజ్ పేయేనన్నారు. అంతటి మానవతావాది అటల్ బిహారి వాజ్ పేయిని ఆయన శత జయంతి సందర్భంగా స్మరించుకోవడం అవసరమన్నారు. ఈ క్రమంలో అటల్ బిహారి వాజ్ పేయి శత జయంతిని పురస్కరించుకుని వాజ్ పేయి విగ్రహాన్ని ప్రతిష్టించడం జరుగుతుందన్నారు. వాజ్ పేయి శత జయంతిని పురస్కరించుకుని, ఆయన స్ఫూర్తిని ప్రపంచానికి తెలియ చేయడం కోసం కూటమి ఆధ్వర్యంలో యాత్ర నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ యాత్ర ధర్మవరంతో మొదలై అమరావతి లో ముగుస్తుందన్నారు. దీనిలో భాగంగా డిసెంబర్ 21 వ తేదీన భారీ బహిరంగ సభ ఉదయం కాకినాడలో, సాయంత్రం రాజమండ్రిలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సభా వేదిక , , సమయం త్వరలో తెలియజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు హారిక, బిజెపి నాయకులు బొమ్మల దత్తు , వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.


