బిల్లును వ్యతిరేకిస్తున్న ఇండియా కూటమి
లోక్ సభలో ఎన్డీయే కూటమికి 282 మంది ఎంపీలు
రాజ్యసభలో మిత్రపక్షాలతో కలిసి ఎన్డీయే సంఖ్యాబలం 125
పార్లమెంటులో జరుగుతున్న బడ్జెట్ సమావేశాలలో వక్ఫ్ బిల్లును బుధవారం లోక్ సభలో ప్రవేశ పెట్టాలని కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయించింది. లోక్ సభ ప్రశ్నోత్తరాలు ముగిసిన తర్వాత.. అంటే మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఈ బిల్లును కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సభలో ప్రవేశపెట్టనున్నారు. వక్ఫ్ సవరణ బిల్లును ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇండియా కూటమిలోని పార్టీలు మంగళవారం ప్రత్యేకంగా సమావేశమై సభలో ఈ బిల్లును అడ్డుకోవాలని తీర్మానించాయి. ఇండియా కూటమి మొత్తం ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేస్తుందని ప్రతిపక్ష నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అత్యంత వివాదాస్పదంగా మారిన వక్ఫ్ సవరణ బిల్లు పార్లమెంటులో పాసవుతుందా? ఏ సభలో ఎవరికెంత బలం ఉంది, బిల్లు పాస్ కావాలంటే ఎంతమంది సభ్యుల మద్దతు కావాలనే వివరాలు..
లోక్‌సభలో..
వక్ఫ్ సవరణ బిల్లు లోక్ సభలో పాస్ కావాలంటే 272 మంది ఎంపీలు (సాధారణ మెజారిటీ) అనుకూలంగా ఓటేయాలి. లోక్ సభలో బీజేపీకి 240 మంది ఎంపీలు ఉండగా.. ఎన్డీయే కూటమిలోని పార్టీలు టీడీపీ (16), జేడీయూ(12), ఎల్జేపీ(రామ్ విలాస్) 5, ఆర్ఎల్‌డీ (2), శివసేన (షిండే) (7) లతో కలిపి మొత్తం 282 మంది ఎంపీలు ఉన్నారు. అంటే వక్ఫ్ బిల్లుకు ఆమోదం లభించడంలో సమస్య ఉండకపోవచ్చని తెలుస్తోంది.
రాజ్యసభలో..
లోక్ సభలో బిల్లుకు ఆమోదం లభించిన తర్వాత గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. రాజ్యసభ ఆమోదానికి 119 మంది సభ్యులు అనుకూలంగా ఓటు వేయాలి. ప్రస్తుతం బీజేపీకి రాజ్యసభలో 98 మంది ఎంపీలు ఉండగా, మిత్ర పక్షాల సభ్యులను కలిపితే ఎన్డీయే సంఖ్యాబలం 125 మంది ఎంపీలుగా ఉంది. ఈ క్రమంలో రాజ్యసభలోనూ వక్ఫ్ సవరణ బిల్లు సునాయాసంగా పాస్ కానుంది.