– డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు (ACB) ఎమ్. కిషోర్ కుమార్
విశాలాంధ్ర – తూర్పుగోదావరి : ఇటీవలి కాలంలో కొంతమంది నకిలీ వ్యక్తులు తాము ACB అధికారులు అని చెప్పి ప్రభుత్వ ఉద్యోగులను మోసగించే ఘటనలు జరుగుతున్నాయని, వారు ACB అధికారుల పేర్లను ఉపయోగించి ఫోన్ కాల్స్ చేసి డబ్బులు డిమాండ్ చేయడం, బెదిరించడం, బ్లాక్‌మెయిల్ చేయడం వంటి చర్యలకు పాల్పడు తున్నారని అవినీతి నిరోధక శాఖ (ACB) రాజమహేంద్రవరం డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు ఎమ్. కిషోర్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత ఆదివారం (19-10-2025) కాకినాడ నగరపాలక సంస్థ ఉద్యోగులకు ఒక అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి, “మీపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి, దాడులు జరగకుండా ఉండాలంటే డబ్బులు ఇవ్వాలి” అనే ధోరణిలో మాట్లాడినట్లు తన దృష్టికి వచ్చిందని ఆయన వివరించారు. గతంలో కూడా జిల్లాలోని కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఇలాంటి బెదిరింపు కాల్స్‌కు గురైనట్లు గుర్తించామని తెలిపారు. అందువల్ల ప్రభుత్వ ఉద్యోగులు ఇలాంటి కాల్స్‌పై అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. *ACB స్పష్టీకరణ* ACB అధికారులు ఎప్పటికీ ఫోన్ ద్వారా డబ్బులు లేదా ఇతర ప్రయోజనాలు అడగరని, ACB పేరుతో డబ్బులు అడిగేవారు పూర్తిగా మోసగాళ్లు అని స్పష్టం చేశారు. ఇలాంటి కాల్స్‌పై ప్రభుత్వ ఉద్యోగులు ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించకూడదని, వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి, ACB అధికారులకు కూడా సమాచారం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. *విజ్ఞప్తి* ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండి, నకిలీ వ్యక్తుల మాటలకు మోసపోవద్దని, ACB పేరుతో మోసం చేయడం ఒక తీవ్రమైన నేరమని తెలిపారు. ఇలాంటి మోసగాళ్లపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్. కిషోర్ కుమార్ స్పష్టం చేశారు. సెల్..9440446160 లేదా కార్యాలయ ల్యాండ్ లైన్ 0883 – 2467833 నెంబర్ కు నేరుగా ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు.


