ఆధారాల ‘అణు బాంబు’ పేల్చితే
ఈసీ ముఖం చాటేయాల్సిందే: రాహుల్
న్యూదిలీ: ఎన్నికల సంఘం (ఈసీ) ఓట్ల దొంగ, బీజేపీ కోసం ఈ పనిచేస్తోందని లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. ఓట్ల చోరికి పాల్పడిన వారు ఏ స్థాయిలో ఉన్నా వదిలిపెట్టమని, పక్కా ఆధారాలతో వారి మోసాలు నిరూపిస్తామన్నారు. ‘మా వద్ద అణు బాంబు లాంటి ఆధారముంది. నిజాల విస్ఫోటనతో ఈసీ ముఖం చాటేయాల్సిందే’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. బీజేపీకి కోసం ఓట్లు దోపిడీకి పాల్పడినవారు పదవిలో ఉన్నా, పదవీ విరమణ పొందినాగానీ వెతికి పట్టుకుంటామని, ఎవరినీ వదిలిపెట్టమని రాహుల్ అన్నారు. ఓట్ల దొంగతనం దేశ ద్రోహమని, ఈ విషయాన్ని కింది నుంచి పై స్థాయి వరకు ఈసీలో పనిచేసే వారంతా గ్రహించాలన్నారు. రాహుల్ శుక్రవారం పార్లమెంటు హౌస్ కాంపెక్స్‌లో విలేకరులతో మాట్లాడుతూ ‘ఓట్ల చోరీ జరుగుతోందని గతంలోనూ చెప్పా. ఇది ఓపెన్`షట్ వ్యవహారం. పక్కా ఆధారాలతో ఈసీ ఓట్లు దొంగతనాన్ని నిరూపించగలం. ఇది ఆరోపణ కాదు. 100 శాతం రుజువు చేయగలం. ఆధారాలను మేము బయటకు తెచ్చాక దేశం మొత్తానికి ఈసీ ఓట్ల దొంగ అని తెలిసిపోతుంది. బీజేపీ కోసమే ఎన్నికల సంఘం ఈ పని చేస్తున్నది’ అని అన్నారు. 2023లో జరిగిన మధ్యప్రదేశ్ ఎన్నికల్లో అవకతవకలు జరిగినట్లు తమ పార్టీ అనుమానించిందని ఆయన తెలిపారు. గతేడాది లోక్‌సభ ఎన్నికల్లో, ఆపై మహారాష్ట్రలోనూ ఎన్నికల తీరు తమకు అనుమానాస్పాదంగా తోచిందని చెప్పారు. ‘మహారాష్ట్రలో రాష్ట్రస్థాయిలో ఓట్ల దొంగతనం జరిగింది. ఓటర్ల జాబితా సవరణ క్రమంలో కోటి మంది చేరారు. వివరాల్లోకి వెళ్లే ప్రయత్నం చేశాం కానీ ఈసీ సహకరించలేదు. దీంతో లోతుగా అధ్యయనం చేయాలని నిర్ణయించం. సొంతంగా దర్యాప్తు చేపట్టాం. ఇందుకు ఆరు నెలలు పట్టింది. అయితే మాకు అణు బాంబు లభించింది. ఇది పేలితే ఈసీకి దాక్కునేందుకు దేశంలో ఎక్కడా స్థానం ఉండదు’ అని రాహుల్ వెల్లడిరచారు. కింది నుంచి పై స్థాయి వరకు ఓట్ల చోరీలో భాగస్వాములైన వారెవరినీ వదిలేది లేదని, వీరు దేశానికి విరుద్ధంగా పనిచేస్తున్నారని అన్నారు. ఇది దేశ ద్రోహంతో సమానమన్నారు. ఓట్ల దొంగతనం చేసిన వారు రిటైర్ అయినా, ఎక్కడ ఉన్నాగానీ వెతికి పట్టుకుంటామని రాహుల్ హెచ్చరించారు. ఇదిలా వుంటే, ఆగస్టు 5న కర్నాటకలో తలపెట్టిన నిరసనలో భాగంగా ఆ రాష్ట్ర ఈసీ ద్వారా ఓటర్ జాబితాల రిగ్గింగ్‌ను బహిర్గతం చేస్తామని కాంగ్రెస్ పేర్కొంది. ఎన్నికలకు సంబంధించి ఇటువంటి తప్పులను నిలదీస్తామని తేల్చిచెప్పింది. రాహుల్ గాంధీ అధ్వర్యంలో బెంగళూరులో మంగళవారం జరగబోయే భారీ నిరసన కోసం ఏర్పాట్లను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సమీక్షించారు. నిరసనలో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పార్టీ శ్రేణులను కోరారు. కాగా, లోక్‌సభ స్పీకర్‌కు ప్రతిపక్ష పార్టీలు ఉమ్మడిగా లేఖ రాశాయి. బీహార్‌లో ఎస్‌ఐఆర్‌పై ప్రత్యేక చర్చ కోసం సమయాన్ని ఇవ్వాలని, ఇందులో మరింత జాప్యం వద్దని కోరాయి. ఎస్‌ఐఆర్ ప్రక్రియపై ప్రతిపక్ష ఎంపీలు తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తంచేశారు. పార్లమెంటు ఉభయ సభల్లో ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్షాల సభ్యులు ఆందోళన కొనసాగించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఓటర్ల తొలగింపే లక్ష్యంగా ఓటర్ల జాబితాల సవరణను ఈసీ చేపట్టిందని ఆరోపించారు. పార్లమెంటులో ఎస్‌ఐఆర్‌పై ప్రత్యేక చర్చకు డిమాండ్ చేశారు.
రాహుల్ ఆరోపణలు నిరాధారం: ఈసీ
న్యూదిల్లీ: బీజేపీ కోసం ఓట్ల చోరీ జరుగుతోందంటూ తమపై నిరాధార ఆరోపణలు చేయడం నిత్యకృతమైందని ఎన్నికల సంఘం వ్యాఖ్యానించింది. ఇలాంటివి పట్టించుకోవద్దని ఎన్నికల అధికారులకు సూచించింది. ‘నిరాధారణ ఆరోపణలు, బెదిరింపులు మామూలే. ఎన్నికల సంఘం వీటికి ప్రాధాన్యత ఇవ్వదు. బాధ్యతారహితంగా చేసే వ్యాఖ్యలను ఎన్నికల అధికారులు కూడా పట్టించుకోవద్దు. మీ పనిని న్యాయంగా, పారదర్శకంగా చేయండి’ అని ఈసీ పేర్కొంది.


