2024 ఎన్నికల్లో ప్రజా ప్రభుత్వం ఏర్పడటంలో ప్రవాస తెలుగువారి (ఎన్నారై) పాత్ర మరువలేనిదని, వారి అండతోనే తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడిందని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు. తెలుగుజాతిని ప్రపంచ యవనికపై నంబర్ వన్ స్థానంలో నిలిపే బాధ్యతను అందరం కలిసికట్టుగా తీసుకుందామని ఆయన పిలుపునిచ్చారు. 2029 ఎన్నికల్లో కూడా ఎన్డీయే కూటమిని గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని స్పష్టం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం జరిగిన ఎన్నారై టీడీపీ సెంట్రల్ కమిటీ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యయ్యారు. ఈ సందర్భంగా, నూతనంగా ఎన్నికైన సభ్యులతో ఎన్నారై సాధికారత, సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేయించారు. గ్లోబల్ ఎన్నారై టీడీపీ అధ్యక్షుడిగా డాక్టర్ పి. గురురాజా బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో లోకేశ్ మాట్లాడుతూ.. ప్రపంచంలో తెలుగువారు లేని దేశం లేదు. ఏ దేశానికి వెళ్లినా కనీసం 20 మంది తెలుగువాళ్లు మనకు కనిపిస్తారు. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక స్వర్గీయ ఎన్టీఆర్. ఆయన రాజకీయాల్లో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చి, చదువుకున్న వారికి, మేధావులకు అవకాశాలు కల్పించారు. ఆయన ఆశయాలను చంద్రబాబు ముందుకు తీసుకెళ్తున్నారు. 2024 ఎన్నికల్లో 50 శాతం స్థానాల్లో యువత గెలుపొందగా, ఏడుగురు ఎన్నారైలకు టీడీపీ అవకాశం కల్పించింది. వారిలో పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి కావడం మనందరికీ గర్వకారణం అని వివరించారు.
కష్టకాలంలో ఎన్నారైలే కొండంత బలం
గత ఐదేళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఁమూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేయాలని చూశారు. ఆనాడు అమరావతి ఉద్యమానికి ఎన్నారైలు అండగా నిలిచారు. వారిపై అక్రమ కేసులు పెట్టినా భయపడలేదు. చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు 50 దేశాల్లోని 200 నగరాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించి తమ గళాన్ని వినిపించారు. ఆ సమయంలో ఃమనకు ఈ రాజకీయాలు అవసరమాః అని నా భార్య బ్రహ్మణి నన్ను ప్రశ్నించింది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మీరు నిర్వహించిన ఃఐయామ్ విత్ సీబీఎన్ః కార్యక్రమం మా కుటుంబానికి కొండంత బలాన్నిచ్చింది. మళ్లీ ప్రజలకు సేవ చేయాలనే సంకల్పాన్ని బలపరిచింది. ఎంతోమంది ఎన్నారైలు వేల డాలర్లు ఖర్చుపెట్టుకుని ఓటు వేయడానికి రాష్ట్రానికి వచ్చారు. ఉద్యోగాలకు సెలవులు పెట్టి గ్రామాల్లో తిరిగి ప్రజలను చైతన్యపరిచారు. మీ కృషితోనే ఈ రోజు ప్రజా ప్రభుత్వం ఏర్పడిందిఁ అని లోకేశ్ భావోద్వేగంగా ప్రసంగించారు.
ఎన్నారైలు.. అత్యంత నమ్మకమైన భారతీయులు
ఎన్నారైలు అంటే మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్ అని అభివర్ణించిన లోకేశ్, వారు మంచి ఉద్యోగాలు చేస్తున్నా నమ్ముకున్న పార్టీ కోసం, తెలుగుజాతి కోసం నిలబడ్డారని ప్రశంసించారు. ఁవిదేశాల్లో ఉంటూ కూడా మీ పిల్లలకు అద్భుతమైన తెలుగు నేర్పిస్తున్నారు. సొంత గ్రామాలపై మమకారం, సేవాభావంతో మీరు చదువుకున్న పాఠశాలల అభివృద్ధికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. మీ నిబద్ధతకు హృదయపూర్వక నమస్కారాలు అని అన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నా, లేకపోయినా తెలుగువారికి అండగా నిలిచిందని గుర్తుచేశారు. ఉత్తరాఖండ్ వరదలు, ఉక్రెయిన్ యుద్ధం, నేపాల్ సంక్షోభం సమయంలో ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి తెలుగువారిని సురక్షితంగా స్వస్థలాలకు చేర్చిన ఘనత చంద్రబాబుదని తెలిపారు.
చంద్రబాబు అరెస్ట్‌కు మూడేళ్లు.. నిరసనకు పిలుపు
చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసి నేటికి సరిగ్గా మూడేళ్లు పూర్తయిందని లోకేశ్ గుర్తుచేశారు. ఁదొంగ కేసు పెట్టి అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. మొదట రూ.3 వేల కోట్ల అవినీతి అన్నారు, తర్వాత రూ.300 కోట్లు, చివరికి రూ.3 కోట్లకు తగ్గించారు. కానీ ఒక్క రూపాయి అవినీతిని కూడా నిరూపించలేకపోయారు. ఐటీ, ఈడీ, కోర్టులు క్లీన్చిట్ ఇచ్చాయి. ఆయన ఏ తప్పూ చేయలేదు. ఆయన అభివృద్ధి చేసిన ప్రాంతంలోనే ఆయన్ను జైల్లో నిర్బంధించారు. ఆ 53 రోజులు మనమంతా పోరాడాం. ఆ అక్రమ నిర్బంధానికి గుర్తుగా ఈ రోజు రాత్రి అందరూ తమ ఇళ్లలో 53 కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలపాలిఁ అని పిలుపునిచ్చారు.
పార్టీ బలోపేతానికి, రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలి
ఎన్నారైలు రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారి, తాము పనిచేస్తున్న కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేలా చొరవ చూపాలని లోకేశ్ కోరారు. దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకి వస్తున్నాయని, రాష్ట్ర అభివృద్ధిలో ఎన్నారైలు భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. పార్టీ కోసం ఎన్నారై సభ్యత్వాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని, ప్రతి ఒక్కరూ మై టీడీపీ యాప్ ద్వారా అనుసంధానం కావాలని సూచించారు.
ఏ దేశంలో పది మంది తెలుగువారు ఉన్నా అక్కడ ఎన్నారై టీడీపీ కమిటీ ఉండాలి. రాబోయే 30 రోజుల్లో కమిటీల నియామకాన్ని పూర్తిచేయాలి. కష్టపడిన వారికే పదవులు ఇవ్వాలిఁ అని దిశానిర్దేశం చేశారు.


