తప్పుడు కథనాలు పై పరువు నష్టందావా వేస్తా:సిఐ అశోక్ కుమార్
విశాలాంధ్ర-రాజాం (విజయనగరం జిల్లా) : కక్షపూరితంగా ప్రముఖ పత్రికలో తప్పుడు వార్తలు రాసి, వ్యక్తిగతంగా తన పరువుకు భంగం కలిగించాలని తన పేరు పెట్టి, కింద క్యారికేచర్ వేసి అసత్య కథనం ప్రచురించారని రాజాంలో నిర్వహించిన మీడియా సమావేశం లో రాజాం టౌన్ సీఐ అశోక్ కుమార్ మాట్లాడారు. శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి 100వ జాతర మహోత్సవం వేడుకలలో అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని,అలాగే అంతకాపల్లి జాతరలో అట్టాటకు అక్రమ వసూళ్లు చేశారని గత రెండు రోజులుగా తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ, తన ఆత్మాభిమానం దెబ్బతీసే విధంగా ‘అశోక వనంలో భక్షక భటుడు ‘ అనే శీర్షికతో అసత్య కథనాలు ప్రచురిస్తున్న దిన పత్రికపై పరువు నష్టం దావా కేసు వేస్తా అని అన్నారు. ఎటువంటి ఆధారాలు లేకుండా నిరాధారంగా తప్పుడు కథనాలు ప్రచురించడం సమంజసం కాదన్నారు. రెండున్నర దశాబ్దాల పాటు పోలీసు శాఖలో వివిధ జిల్లాల్లో తన వృత్తిని దైవంగా భావించి ప్రజా సేవకే అంకితం అయిన తన పై నేడు ఇలాంటి అసత్య ఆరోపణల వార్తలు రావడం బాధాకరం అని అన్నారు. ఇలాంటి తప్పుడు కథనాలు ప్రచురించి తన పోలీసు వృత్తిని అవమానించారని అశోక్ కుమార్ పేర్కొన్నారు.


