విశాలాంధ్ర–పుట్టపర్తి: ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో పుట్టపర్తి మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.7.20 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు గురువారం భూమిపూజలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథరెడ్డి చేతుల మీదుగా కార్యక్రమాలు జరిగాయి. ఆర్టీసీ డిపో సమీపంలో రూ.48 లక్షలతో నిర్మించిన గోకులం మినీ పార్కు, మెప్మా ఆధ్వర్యంలో రూ.10 లక్షలతో ఏర్పాటు చేసిన మిల్లెట్స్ ఫుడ్ పార్కును ప్రారంభించారు. సంత మార్కెట్ రోడ్డులో రూ.20 లక్షలతో స్మశానవాటిక ప్రహరీ, డ్రైనేజీ పనులు, కర్ణాటక నాగేపల్లి రోడ్డులో రూ.17.50 లక్షలతో డ్రైనేజీ, సీసీ రోడ్డు, సాయినగర్‌లో రూ.22.50 లక్షలతో సీసీ రోడ్డు, భూగర్భ డ్రైనేజీ పనులకు భూమిపూజ చేశారు. చిత్రావతి రోడ్డులో రూ.4.25 కోట్లతో నిర్మించనున్న నూతన మున్సిపల్ కార్యాలయానికి, 4.20 ఎకరాల్లో నిర్మించనున్న మల్టీ స్పోర్ట్స్ ఇండోర్ స్టేడియానికి శంకుస్థాపన చేశారు. ఎనుములపల్లి ఎస్సీ కాలనీలో రూ.39.70 లక్షలు, బ్రాహ్మణపల్లి ఎస్సీ కాలనీలో రూ.20 లక్షలతో డ్రైనేజీ పనులు చేపట్టనున్నారు. బ్రాహ్మణపల్లి, బడే నాయక్ తండాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.6.50 లక్షల చొప్పున నూతన బోర్లు ఏర్పాటు చేయనున్నారు. పట్టణ ఆరోగ్య కేంద్రానికి రూ.కోటి, అదనంగా రూ.23.50 లక్షలతో బోరు బావుల తవ్వకం పనులకు కూడా భూమిపూజ నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. 5వ తరం ఫైటర్ జెట్ పరిశ్రమ, అమడగూరులో రిలయన్స్ సహకారంతో సోలార్ పరిశ్రమ, పెడబల్లి పంచాయతీలో 20 ఎకరాల్లో జీన్స్ పరిశ్రమ ఏర్పాటు వంటి ప్రతిపాదనలను ప్రస్తావించారు. వీటి ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు.రెండేళ్ల కూటమి పాలనలో నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందని వారు పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని, అభివృద్ధికి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు.కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు, మాజీ కౌన్సిలర్ వెంకట రమణమ్మ, మహమ్మద్ రఫీ, బెస్త చలపతి, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పుట్టపర్తి మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.7.20 కోట్లతో పనులకు శ్రీకారం…
- Advertisement -
RELATED ARTICLES


