Homeఆంధ్రప్రదేశ్పోలీసుల ముందు లొంగిపోయిన వైసీపీ నేత నిత్యానందరెడ్డి

పోలీసుల ముందు లొంగిపోయిన వైసీపీ నేత నిత్యానందరెడ్డి

- Advertisement -

కడప రాజకీయాల్లో సంచలనం సృష్టించిన వైసీపీ కార్యకర్త, రియల్ ఎస్టేట్ వ్యాపారి పెద్ద దస్తగిరి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న కడప మాజీ డిప్యూటీ మేయర్, వైసీపీ నేత నిత్యానందరెడ్డి ఎట్టకేలకు పోలీసుల ఎదుట లొంగిపోయారు. గత 20 రోజులుగా పరారీలో ఉన్న ఆయన కోసం పోలీసులు ఏపీతో పాటు పొరుగు రాష్ట్రాల్లో కూడా గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే ఈ ఉదయం ఆయన నేరుగా ఎస్పీ కార్యాలయానికి వచ్చి పోలీసులకు లొంగిపోయారు.

కొన్ని రోజుల క్రితం కడపలోని రిమ్స్ ఆసుపత్రి సమీపంలో పెద్ద దస్తగిరి దారుణంగా హత్యకు గురయ్యారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు ఇప్పటికే 11 మంది నిందితులను అరెస్ట్ చేశారు. పట్టుబడిన నిందితులను విచారించగా, నిత్యానందరెడ్డి ఆదేశాల మేరకే తాము ఈ హత్యకు పాల్పడినట్లు వారు వాంగ్మూలం ఇచ్చారు. దీంతో పోలీసులు నిత్యానందరెడ్డిని ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా పేర్కొంటూ నిందితుల జాబితాలో చేర్చారు.

నిత్యానంద రెడ్డి పరారీలో ఉన్న సమయంలో పోలీసులు ఆయన నివాసంలో అర్ధరాత్రి వేళల్లో ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో సుమారు రూ. 100 కోట్ల విలువైన భూములకు సంబంధించిన కీలక దస్తావేజులు, రిజిస్ట్రేషన్ పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ హత్య వెనుక కేవలం రాజకీయ కారణాలే కాకుండా, పెద్ద ఎత్తున భూ వివాదాలు, ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ కేసు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అధికార కూటమి నేతలు ఈ హత్య వెనుక పెద్దల హస్తం ఉందని ఆరోపిస్తుండగా, వైసీపీ నేతలు మాత్రం ఇది కేవలం వ్యక్తిగత గ్రూపుల మధ్య జరిగిన గొడవ అని, తమ పార్టీ నేతలను ఇరికించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వాదిస్తున్నారు. నిత్యానంద రెడ్డి లొంగిపోవడంతో, విచారణలో మరిన్ని అసలు నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు