జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
విశాలాంధ్ర – హైదరాబాద్ : విద్యార్థులలో కంటి చూపు లోపాలని ముందుగా గుర్తించి మెరుగైన చికిత్సలు అందేలా ప్రభుత్వం ఉచిత కంటి పరీక్షలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. సోమవారం మెహిదీపట్నం సఫ్దరియా బాలికల పాఠశాలలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆర్‌బిఎస్‌కె కార్యక్రమం కింద దృష్టి లోపం ఉన్న పిల్లలకు కళ్లద్దాలు పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ శెట్టి పాల్గొని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యం నిర్దేశించుకుని చదవాలని అన్నారు. విద్యార్థులు మొబైల్, టాబ్, కంప్యూటర్, టివి వంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్‌పై ఎక్కువ సమయం కేటాయించడంతో విద్యార్థులలో కంటి సమస్యలు ఎక్కువ అవుతున్నాయని వాటి నివారణకు హైదరాబాద్ జిల్లాలో మొదటి దశలో గత ఏప్రిల్, 2024లో రెసిడెన్షియల్ హాస్టల్స్‌లలో విద్యార్థులకు కంటి పరీక్షల నిర్వహించడం జరిగిందని అలాగే రెండో దశలో సెప్టెంబర్ 2024 నుండి డిసెంబర్ 2024 వరకు అనుబంధ పాఠశాలలో కంటి పరీక్షలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. పాఠశాలలో చదువుతున్న పిల్లలను కంటి పరీక్షలు చేపట్టి దృష్టి లోపాన్ని గుర్తించి నాణ్యమైన కంటి అద్దాలను అందిస్తున్నామని పిల్లలు చదువుపై ఎక్కువ దృష్టి సారించి తమ లక్ష్యాన్ని చేరుకోవా లని ఆకాంక్షించారు. జిల్లాలోని 695 పాఠశాలలో 71309 విద్యార్థులకు కంటి పరీక్షల నిర్వహిం చగా అందులో 8849 మందికి వక్రీభవన లోపాలతో ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. అదే విధంగా 15 రోజులపాటు పునః పరీక్ష ఐదు ప్రధాన ఆస్పత్రిలో నిర్వహించడం జరిగిందని అందులో 7524 మందికీ దృష్టి లోపాలు ఉన్నాయని ధ్రువీకరించడంతో పిల్లల ఉజ్వల భవిష్యత్తు లక్ష్యంగా నాణ్యమైన కంటి అద్దాలు అందించే దిశగా అందరికీ ఆర్‌బిఎస్‌కే ద్వారా కంటి అద్దాలు అందించడం జరుగుతుందని అందులో భాగంగా జిల్లాలోని మూడు పాఠశాలలోని 40 మంది విద్యార్థులకు అందించడం జరిగిందని తెలిపారు. దృష్టిలోపం ఉన్న పిల్లలు వారు తప్పనిసరిగా కళ్లద్దాలు వాడాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్‌ఓ డాక్టర్ వెంకటి, డిఈఓ రోహిణి, డిప్యూటీ డిఎంహెచ్‌ఓలు డా. సాయిబాబా, డా. మురళీధర్, డిఐఓ డా.శీధర్, డిఎంఓ రాములు, కార్పొరేటర్ సరారాేజ్ అహ్మద్, పాఠశాల కరస్పాండెంట్ అలీ మీర్జా, హెచ్‌ఎం బేబీజైనబ్, మెడికల్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.