Tuesday, February 4, 2025
Homeసంపాదకీయంఆశలన్ని సుప్రీంకోర్టు మీదే

ఆశలన్ని సుప్రీంకోర్టు మీదే

ఎన్నికల కమిషన్‌ ప్రధానాధికారిని, మరో ఇద్దరు కమిషనర్లను నియమించే కమిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి స్థానం లేకుండా చేసిన 2023 నాటి చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లు వచ్చే 12వ తేదీన విచారణకు రానున్నాయి. ప్రస్తుత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ వచ్చే 18వ తేదీన పదవీ విరమణ చేస్తారు కనక ఈ కేసు విచారణకు ప్రాధాన్యత ఉంది. నిజానికి ఈ పిటిషన్లు మంగళవారం (ఫిబ్రవరి నాల్గవ తేదీన) విచారణకు రావాల్సింది. కానీ ఆ రోజు పిటిషన్ల విచారణా క్రమంలో ఈ కేసు 42వ స్థానంలో ఉన్నందువల్ల ఆ రోజు విచారణకు రాకపోవచ్చునని సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ న్యాయమూర్తులు సూర్య కాంత్‌, ఎన్‌. కోటీశ్వర్‌ సింగ్‌ దృష్టికి తెచ్చినందువల్ల 12వ తేదీన విచారించాలని నిర్ణయించారు. వీలైతే ఆ రోజే విచారణ పూర్తి చేస్తామని న్యాయమూర్తులు సూర్య కాంత్‌, కోటీశ్వర్‌ సింగ్‌ చెప్పారు. విచారణ పూర్తి అయినా ఆ రోజే తీర్పు వెలువడాలన్న నిబంధన ఏమీ లేదు. ఈ పిటిషన్లను విచారిస్తున్నది న్యాయమూర్తులు సూర్య కాంత్‌ అయినప్పటికీ ఈ కేసుపై ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్‌ ఖన్నా హయాంలో ఎలాంటి తీర్పు వెలువడనుందోనన్న ఉత్సుకత ఉంది. ఈ కేసుపై కనీసం తాత్కాలిక ఉత్తర్వు అయినా జారీ చేయాలని ప్రశాంత్‌ భూషణ్‌ కోరారు. ఎందుకంటే రాజీవ్‌ కుమార్‌ స్థానంలో మరొకరిని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను చేయడం, మరో ఎన్నికల కమిషనర్‌ని నియమించడం లాంటివి ఉంటాయి కాబట్టి ఈ చట్టం ద్వారా ఎదురయ్యే సమస్యలకు ఓ పరిష్కారం కుదరాలి. పైగా ఈ అంశం మీదే అనూప్‌ బరన్వాల్‌కు, భారత ప్రభుత్వానికి మధ్య ఉన్న కేసులో రాజ్యాంగ బెంచి ఇదివరకే ఓ తీర్పు వెలువరించి ఉంది. కానీ ఎన్నికల కమిషనర్లను నియమించడంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి స్థానం లేకుండా మోదీ ప్రభుత్వం చట్టమే తీసుకొచ్చింది కనక ఈ విషయం సుప్రీంకోర్టులో తేలాల్సిందే. అందుకే ప్రధాన న్యాయమూర్తి సంజీవ్‌ ఖన్నా హయాంలో ఎలాంటి తీర్పు వస్తుందన్నది ఆసక్తికరమైన అంశం అవుతోంది. అనూప్‌ బరన్వాల్‌ కేసులో ప్రభుత్వం మాత్రమే ఎన్నికల కమిషనర్లను నియమించడానికి వీలు లేదు అని అప్పుడు సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. వీరిని స్వతంత్ర కమిటీ నియమించాలి అని ఆ తీర్పులో పేర్కొన్నారు. లేకపోతే మన ప్రజాస్వామ్యానికే ముప్పు అని కూడా ఆ తీర్పులో పేర్కొన్నారు. కానీ మోదీ ప్రభుత్వం చట్టాన్ని మార్చేసి ఎన్నికల కమిషనర్లను నియమించే కమిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి స్థానం లేకుండా చేసింది. దీని ప్రకారం ఆ కమిటీలో ప్రధానమంత్రి, ఆయన ప్రతిపాదించే మరో కేంద్ర మంత్రి ప్రతిపక్ష నాయకుడు ఉంటారు. ముగ్గురు సభ్యులు ఉండే కమిటీలో ప్రధాని, మరో కేంద్ర మంత్రి ఉన్నప్పుడు మిగిలిన మూడో సభ్యుడైన ప్రతిపక్ష నాయకుడికి ఉండే పాత్ర సహజంగానే లాంఛన ప్రాయంగా మిగిలిపోతుంది. ఇదివరకు రాజ్యాంగ పీఠం ఇచ్చిన తీర్పు సరిగా 2023 నాటి చట్టానికి పూర్తిగా విరుద్ధమైంది. ఈ చట్టం ఎన్నికల కమిషనర్ల నియామకం కేవలం ప్రభుత్వం చేతిలోనే ఉండేట్టుగా మార్చేసింది. అందుకే ఎన్నికల కమిషనర్లను నియమించడానికి స్వతంత్ర కమిటీ ఉండాలని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలనే వారు వాదిస్తున్నారు.
విచిత్రం ఏమిటంటే సోలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా సుప్రీంకోర్టు కనీసం తాత్కాలిక ఉత్తర్వునైనా జారీ చేయాలన్న పిటిషనర్ల తరఫు న్యాయవాదులు చేసిన అభ్యర్థనను గట్టిగా వ్యతిరేకించారు. ప్రభుత్వం వాదన సిద్ధంగా ఉందని అందువల్ల ఈ పిటిషన్‌పై తుది విచారణే జరగాలని తుషార్‌ మెహతా అన్నారు. వీలైతే వచ్చే 12వ తేదీననే ఈ కేసు విచారణను ముగిద్దామని న్యాయమూర్తి సూర్యకాంత్‌ అన్నారు. ఎన్నికల కమిషనర్లుగా నియమించడానికి అభ్యర్థులను సూచించే కమిటీ ప్రతిపాదించిన పేర్లే కాకుండా ఇతర పేర్లను కూడా ముగ్గురు సభ్యుల కమిటీ ప్రతిపాదించవచ్చునని 2023 నాటి చట్టంలో పేర్కొన్నారు. అంటే ఈ విషయంలో ప్రభుత్వానికే సర్వాధికారాలూ ఉండాలన్నది మోదీ ప్రభుత్వ నిర్ణయం. అభ్యర్థులను ఎంపిక చేయడానికి అనుసరించ వలసిన విధి విధానాలను కూడా ఈ ముగ్గురు సభ్యుల కమీటీయే ఖరారు చేసుకోవచ్చు. ఇది కూడా ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరించడానికి అనువైనదే. సుప్రీంకోర్టు న్యాయమూర్తి కె.ఎం.జోసెఫ్‌ నాయకత్వంలోని బెంచి ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన కమిటీ నియమించాలని విస్పష్టమైన తీర్పు ఇచ్చినా ఆ నిర్ణయాన్ని నిర్వీర్యం చేయడానికి మోదీ ప్రభుత్వం ఏకంగా చట్టాన్నే మార్చేసింది. ముగ్గురు సభ్యుల కమిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి స్థానం లేకుండా చేయడానికి చట్టాన్నే మార్చేయడం సహజంగానే తీవ్ర విమర్శలకు దారితీసింది. స్వతంత్రంగా వ్యవహరించవలసిన ఎన్నికల కమిషన్‌ మీద ప్రభుత్వ ఆధిపత్యం కొనసాగడానికే ఈ చట్టంలో మార్పులు చేశారు. ఇది అంతకు ముందు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును తిరగదోడడానికి ఉపకరించింది. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ నాయకురాలు జయా ఠాకూర్‌, ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం, మరి కొందరు సుప్రీంకోర్టు కెక్కారు. ఈ వివాదం చెలరేగిన సమయంలోనే సుప్రీంకోర్టు చట్టంలో చేసిన మార్పు చెల్లదని ఎక్కడ ప్రకటిస్తోందనన్న భయంతో మోదీ ప్రభుత్వం గ్యానేష్‌ కుమార్‌, సుఖ్బీర్‌ సింగ్‌ సంధూను ఎన్నికల కమిషనర్లుగా నియమించాలని రాష్ట్రపతికి సిఫార్సు చేసింది. వారి నియామకమూ గత మార్చి 14న జరిగి పోయింది. ఆ సమయంలో ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేయకుండా ఈ హడావుడి నియామకాలు జరిగిపోయాయి. అప్పుడు ఈ పిటిషన్లను విచారించిన బెంచి 2023 నాటి చట్టాన్ని నిలిపి వేయడానికి అప్పుడు న్యాయమూర్తిగా ఉన్న సంజీవ్‌ ఖన్నా, దీపంకర్‌ దత్తాతో కూడిన బెంచి నిరాకరించింది. ఆ తరవాత నవంబర్‌లో సంజీవ్‌ ఖన్నా ప్రధాన న్యాయమూర్తి అయిపోయారు. అసలు ఈ చట్టం రాజ్యాంగ బద్ధమైందా కాదా, ఎన్నికల కమిషనర్లను నియమించడానికి అనుసరించిన పద్ధతి సవ్యమైందా కాదా అన్న రెండు అంశాలను పరిశీలించవలసి ఉందని ఆనాడు కేసును విచారించిన న్యాయ మూర్తులు సంజీవ్‌ ఖన్నా, దీపంకర్‌ దత్త వ్యాఖ్యానించారు. ఇప్పుడు విచారిస్తున్న న్యాయమూర్తుల్లో వీరిద్దరూ లేరు. న్యాయ మూర్తులు సూర్యకాంత్‌, కోటీశ్వర్‌ సింగ్‌తో కూడిన బెంచి విచారించవలసి ఉంది. న్యాయవ్యవస్థను లొంగ దీసుకోవడానికి ప్రభుత్వాలు ప్రయత్నించడం కొత్త కాదు. 1973లోనే ముగ్గురు సీనియర్‌ న్యాయమూర్తులని కాదని న్యాయమూర్తి ఎ.ఎన్‌.రేను ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. 1977లో న్యాయమూర్తి హన్స్‌ రాజ్‌ ఖన్నాను కాకుండా న్యాయమూర్తి మిర్జా హమీదుల్లా బేగ్‌ ను ప్రధాన న్యాయమూర్తిని చేశారు. ఈ దుస్సంప్రదాయన్ని కొనసాగించడమే ఇప్పుడు మోదీకి కావల్సింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు