Sunday, July 13, 2025
Homeజాతీయంఆకస్మిక మరణాలకు, కోవిడ్ వ్యాక్సిన్లపై సంబంధం లేదని వెల్లడి

ఆకస్మిక మరణాలకు, కోవిడ్ వ్యాక్సిన్లపై సంబంధం లేదని వెల్లడి

ఐసీఎంఆర్ అధ్యయనంలో కీలక నిజాలు!
నివేదికను విడుదల చేసిన ఐసీఎంఆర్, ఎయిమ్స్

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి తర్వాత యువతలో ఆకస్మిక మరణాలు, గుండెపోటు కేసులు పెరగడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ మరణాలకు కోవిడ్-19 వ్యాక్సిన్లే కారణమంటూ సోషల్ మీడియాలోనూ, ప్రజల్లోనూ తీవ్రమైన ప్రచారం జరిగింది. ఈ ఊహాగానాలకు తెరదించుతూ భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్), ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనం కీలక విషయాలను వెల్లడించింది. కోవిడ్ టీకాలకు, యువతలో సంభవిస్తున్న ఆకస్మిక మరణాలకు మధ్య ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేదని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. దేశంలో ముఖ్యంగా 40 ఏళ్లలోపు వయసున్న వారిలో గుండెపోటు ఘటనలు ఎక్కువవుతున్న నేపథ్యంలో ఈ అధ్యయనాన్ని చేపట్టారు. కరోనా తర్వాత కొంతమంది ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేకుండా అకస్మాత్తుగా కుప్పకూలి మరణించిన ఘటనలు నమోదయ్యాయి. దీంతో వ్యాక్సిన్ల భద్రతపై ప్రజల్లో అనేక సందేహాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో ఐసీఎంఆర్, ఎయిమ్స్ కలిసి శాస్త్రీయంగా పరిశోధన చేసి, వాస్తవాలను ప్రజల ముందు ఉంచాయి. ఈ అధ్యయనం ప్రకారం, ఆకస్మిక మరణాలకు వ్యాక్సిన్‌ను కారణంగా చూపడానికి ఎలాంటి ఆధారాలు లభించలేదని నిపుణులు తేల్చిచెప్పారు. గతంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా కోవిడ్ వ్యాక్సిన్లు, యువతలో గుండెపోటు మధ్య సంబంధం లేదని ప్రకటించింది. ఇప్పుడు ఐసీఎంఆర్ అధ్యయనం కూడా ఇదే విషయాన్ని బలపరిచింది. యువతలో సంభవిస్తున్న మరణాలకు వారి జీవనశైలి, ముందు నుంచి ఉన్న ఆరోగ్య సమస్యలే ప్రధాన కారణాలని ఈ జాతీయ అధ్యయనంలో గుర్తించారు. ప్రస్తుతం 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు వారిలో సంభవిస్తున్న ఆకస్మిక మరణాల వెనుక ఉన్న కచ్చితమైన కారణాలను మరింత లోతుగా శోధించేందుకు ఐసీఎంఆర్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్‌సీడీసీ) కలిసి పనిచేస్తున్నాయి. ఈ పరిశోధనల ద్వారా భవిష్యత్తులో ఇలాంటి అకాల మరణాలను నివారించేందుకు మార్గాలను అన్వేషించనున్నారు. మొత్తానికి, వ్యాక్సిన్ల వల్లే మరణాలు సంభవిస్తున్నాయనే ఆందోళనలకు ఈ అధ్యయనం తెరదించినట్టయింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు