Homeఏపీ సెట్స్ ఎప్ప్పుడు?

ఏపీ సెట్స్ ఎప్ప్పుడు?

- Advertisement -

. విద్యార్థుల ఎదురు చూపు
. గత ఏడాది ప్రవేశాల జాప్యం
. సకాలంలో విడుదల చేయాలని వినతులు
. ప్రైవేట్ వర్సిటీలలో ప్రవేశాల జాతర

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి : రాష్ట్రంలోని డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ కోర్సుల్లో చేరాలనుకునే ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్) క్యాలెండరు కోసం విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. 2026-27 విద్యా సంవత్సరానికి గాను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (ఏపీఎస్‌సీహెచఈ) నేతత్వంలో షెడ్యూలు విడుదలకు ఇప్పటికే ప్రాథమికంగా కసరత్తు పూర్తయినట్లు తెలిసింది. ఇటీవల ఉన్నత విద్యామండలి అధికారులు దీనిపై కసరత్తు చేసి… షెడ్యూలకు తేదీలు ఖరారు చేసినట్లు సమా చారం. అయితే దీనిని ఇంకా అధికారికంగా విడుదల చేయక పోవడంపై విద్యార్థుల్లో నిరుత్సాహం నెలకొంది. ఏపీ సెట్స్ ద్వారా ఏపీ ఈసెట్, ఏపీ ఐసెట్, ఏపీ ఈఏపీసెట్, ఏపీ పీజీఈ సెట్, ఏపీ లాసెట్, ఏపీ పీజీ సెట్ తదితర ప్రవేశ పరీక్షలు కంప్యూటర్ ఆధారిత (సీబీటీ) పద్ధతిలో ప్రతి ఏటా జరుగుతాయి. జాతీయ పోటీ పరీక్షలకు, రాష్ట్రంలో నిర్వహించే వాటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటిని నిర్వహించాల్సి ఉంది. ఈసారి ఎటువంటి జాప్యం లేకుండా విద్యా సంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకుని ఏప్రిల్ నెల నుంచే పరీక్షల ప్రక్రియను ప్రారంభిస్తారని విద్యార్థులు ఆశిస్తున్నారు. ఇందులో ప్రధానంగా ఏపీ ఈఏపీసెట్ పరీక్ష కీలకం కానుంది. ప్రతి ఏటా పెద్ద ఎత్తున ఇంటర్ సీనియర్ విద్యార్థులు దీనిని రాస్తారు. ఏపీఈపీసెట్ ద్వారా ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ విభాగాల్లో డిగ్రీ కోర్సులను భర్తీ చేస్తారు. గత ఏడాది తెలంగాణా కంటే రాష్ట్రంలో ఏపీ ఈఏపీసెట్‌ను ఆలస్యంగా విడుదల చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. షెడ్యూలు జాప్యం వల్ల పరీక్షల నిర్వహణలోను, ఆ తర్వాత కౌన్సెలింగ్‌లోను జాప్యం ఏర్పడింది. జాతీయ స్థాయిలో జేఈఈ మెయిన్స్ పరీక్షలను దష్టిలో ఉంచుకుని, ఏపీఈఏపీసెట్ షెడ్యూలును జారీ చేయాల్సి ఉంది. ఇప్పటికే జేఈఈ మెయిన్స్ మొదటి దశ పరీక్ష పూర్తయింది. ఇక జేఈఈ సెషన్ 2 ను ఏప్రిల్‌లో నిర్వహించనున్నారు. ఈ ఏడాది పరీక్షల నిర్వహణలో ఎటువంటి జాప్యం ఉండదని, జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను పరిగణనలోకి తీసుకుని ఈ తేదీలను ఖరారు చేసినట్లు మండలి తెలిపింది. అభ్యర్థులకు ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు లేకుండా ముందస్తుగానే షెడ్యూలు విడుదల చేయాల్సి ఉంది. ఒక వైపు ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ముందస్తుగానే ఇంజినీరింగ్ కళాశాలల్లోకి ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే మొదటి దశ పరీక్షలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాయి. ఇందుకోసం ప్రత్యేక పీఆర్వో వ్యవస్థను ఏర్పాటు చేసుకుని విద్యార్థుల సమాచారం ఆధారంగా కళాశాలలకు ప్రత్యేక బందాలు వెళుతున్నాయి. అంతేకాకుండా విద్యార్థులకు ఫోన్లు చేసి ఆకర్షిస్తున్నాయి. ప్రైవేట్ వర్సిటీలలో ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షకే రూ.వెయ్యి నుంచి 1,500 వరకు ఫీజు వసూలు చేస్తున్నాయి. ప్రతి ఏటా ఇదే పరిస్థితి ఏర్పడుతోంది. ప్రైవేట్ విద్యా సంస్థలు ముందస్తుగా ప్రవేశాలను ఆహ్వానిస్తుండగా… ప్రభుత్వం మాత్రం వెనుకబడుతోంది. అదే సమయంలో ఇంజినీరింగ్ కోర్సుల ప్రవేశాలకు సకాలంలో ఏపీ ఈఏపీసెట్ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తే ఈ పరిస్థితి ఉండబోదని విద్యావేత్తలు సూచిస్తున్నారు. మిగిలిన సెట్లకు సైతం సకాలంలో పరీక్షలు పరీక్షలు నిర్వహించేలా చూడాలని కోరుతున్నారు.
ముందస్తుగా షెడ్యూలు రావడం వల్ల విద్యార్థులకు కేంద్ర, రాష్ట్ర స్థాయిలో జరిగే పరీక్షలకు అనువుగా సన్నద్ధమయ్యేందుకు వీలవుతుంది. అన్నీ ఏకకాలంలో రావడంతో దేనికి సన్నద్ధమవ్వాలనేదీ వారికి ప్రశ్నార్థకంగా మారుతుంది. మరోవైపు, విద్యార్థులు అవసరమైన కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్పందించి… ఇప్పటికే సిద్ధమైనట్లుగా ప్రచారంలో ఉన్న ఏపీ సెట్స్ షెడ్యూలును అధికారికంగా విడుదల చేయించేందుకు చర్యలు తీసుకుని, తద్వారా ప్రవేశ పరీక్షల నిర్వహణ, కౌన్సెలింగ్‌లలో ఈ విద్యా సంవత్సరం రాష్ట్రం ముందుండేలా చూడాలని విద్యార్థులు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు