లక్నో: ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ న్యాయమూర్తి గత ఐదు నెలల్లో 10 వేర్వేరు కేసుల్లో 22 మందికి మరణ శిక్ష విధించిన సంచలనం సృష్టించారు. తాజాగా మరొక వ్యక్తిని ఉరికంబమెక్కించే తీర్పునిచ్చారు. ముజఫర్‌నగర్ అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి రవి కుమార్ దివాకర్ ఇప్పటివరకు విధించిన మరణశిక్షల సంఖ్య 23కు చేరింది. భార్యను సజీవ దహనం చేసిన కేసులో నిందితుడు నదీమ్‌కు న్యాయమూర్తి మరణశిక్ష విధించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ మాఫియా/గ్యాంగ్‌స్టర్‌పై చర్యలు తీసుకుంటే తనను మరో జిల్లాకు బదిలీ చేస్తామని బెదిరింపులు వచ్చినట్లు న్యాయమూర్తి తీర్పు సందర్భంగా తెలిపారు. తాను తన సిద్ధాంతాలను వదులుకోనని చెప్పారు. ‘పిరికివాడినని అనిపించుకోవడం కంటే చావడమే మేలు’ అని వ్యాఖ్యానించారు. ‘నా సూత్రాలు పాటించ లేని పరిస్థితి వస్తే రాజీనామా చేస్తా’ అని ప్రకటించారు. నేరస్థుల ఒత్తిడికి తలొగ్గి పనిచేస్తే ప్రజలకు న్యాయవ్యవస్థపై విశ్వాసం దెబ్బతింటుందని అన్నారు. కాగా, జస్టిస్ రవి కుమార్ దివాకర్ నేతృత్వ విచారణ పరిధి నుంచి 100 కేసులను జిల్లా న్యాయమూర్తి వెనక్కి తీసుకుని… ఇతర కోర్టులకు బదిలీ చేసినట్లు సమాచారం. గతంలో వివాదాస్పద జ్ఞానవాపి మసీదుపై సర్వేకు జస్టిస్రవి కుమార్ దివాకర్ ఇచ్చిన ఆదేశాలు కూడా చర్చకు దారితీశాయి.


